
ప్రభావిత గ్రామాలకు పండ్ల మొక్కలు
గోదావరిఖని(రామగుండం): పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పాటుపడుతోందని, ప్రభావిత గ్రామాలకు పండ్ల మొక్కలు అందిస్తామని సంస్థ సీఎండీ ఎన్.బలరాం అన్నారు. ఆదివారం ఆర్జీ–1 ఏరియాలోని సివిల్ డిపార్ట్‌మెంట్ ఫిల్టర్‌బెడ్ వద్ద ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో మొక్కలు నాటారు. కోల్ కంపెనీలాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.8వేల కోట్లు ట్యాక్స్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా నర్సరీల్లో 50లక్షల మొక్కలు ఉన్నాయని, వాటిని సంస్థ ప్రభావిత గ్రామాల్లో నాటుతామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 30మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ఒడిశాలోని నైనీలో 10మిలియన్, వీకే ఓసీపీలో 6మిలియన్, జేకే ఓసీసీలో 3మిలియన్ టన్నులు తీస్తామన్నారు. అధికారులు, కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని వెల్లడించారు. సేఫ్టీ మేనేజ్‌మెంట్ ప్లాన్ పాటిస్తూ సంస్థ రోల్‌మోడల్‌గా ఉండాలన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత, సీఎంఓఏఐ అధ్యక్షుడు బి.మల్లేశ్, యూనియన్ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వెయ్యి మొక్కలు నాటగా అందులో సీఎండీ 500 మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు.
మేడిపల్లి ఓసీపీ సందర్శన
మూతపడిన మేడిపల్లి ఓసీపీ ప్రాంతాలను సీఎండీ బలరాం సందర్శించారు. సుమారు 6.26 హెక్టార్ల విస్తీర్ణంలో 7 జలాశయాల నిర్మాణం చేపట్టారని, చేపల పెంపకం, తాగునీటి అవసరాలకు మినీ చెరువులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్విరాన్‌మెంట్ అధికారి ఆంజనేయప్రసాద్ తదితరులు పేర్కొన్నారు.
● సింగరేణి సీఎండీ బలరాం