● రూ.3,53,321 చెల్లించాలని ఉన్నతాధికారులకు నోటీసులు
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం సంస్థ టెంపరరీ టౌన్ షిప్‌లో కేటాయించిన పోలీసుల నివాసాలకు అద్దె బకాయిలు పెరిగిపోయాయని వెంటనే చెల్లించాలని సంబంధిత ఉన్నతాధికారులకు ఎన్టీపీసీ హెచ్‌ఆర్ విభాగం నుంచి నోటీస్ జారీచేశారు. టెంపరరీ టౌన్‌షిప్‌లోని ఏ,బీ,సీతో పాటు పలు కేటగిరిల్లో నివాస గృహాలున్నాయి. సంస్థలో పనిచేస్తున్న వారితో పాటు కాంట్రాక్టర్లు, రెవెన్యూ, పోలీస్ విభాగాలకు చెందిన పలువురికి నివాస గృహాలను అద్దె ప్రాతిపదికన మంజూరు చేశారు. కొంతమంది సిబ్బంది ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసే సమయంలో పొందిన క్వార్టర్‌ను ఖాళీ చేయకుండా ఇతర ప్రాంతాలకు బదిలీకాగా కొత్తగా బదిలీపై వచ్చిన వారికి క్వార్టర్లను కేటాయించలేకపోయారు. ఈ క్రమంలో ఏ కేటగిరి క్వార్టర్‌కు ఓ కానిస్టేబుల్ 19 నెలల అద్దె, విద్యుత్ బకాయిలు కలిపి రూ.1,53,796 (ఫిబ్రవరి–23వరకు), బి కేటగిరిలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు రూ.1,70,970, సీ కేటగిరిలో ఉన్న ఓ పోలీస్ అధికారి రూ.28,555 అద్దె చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఐదు క్వార్టర్లకు సంబంధించి అద్దె, విద్యుత్ బకాయిలు మొత్తం రూ.3,53,321 చెల్లించాలని రామగుండం పోలీస్ కమిషనరేట్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, పెద్దపల్లి, రామగుండం సర్కిల్ కార్యాలయాలకు చెల్లింపు నోటీసు వివరాల ప్రతులను పంపించినట్లు విశ్వసనీయ సమాచారం.