జీతాల్లేవు.. పోస్టింగులూ లేవు!
అయోమయంలో గురుకులాల అవుట్‌సోర్సింగ్ టీచర్లు కొత్తగా ఉపాధ్యాయులు చేరిన స్థానాల్లోని టీచర్లకు పోస్టింగ్‌లు లేవు అదే పాఠశాలల్లో పనిచేస్తున్నా రెండు నెలలుగా జీతాల్లేవు వర్క్ అడ్జెస్ట్‌మెంట్ పేరుతో కొద్దిమందికే కళాశాలల్లో అవకాశం తేలని 1143 మంది భవితవ్యం
న్యాయం చేయండంటూ గిరిజన గురుకుల అవుట్‌సోర్సింగ్ టీచర్లు ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి, గిరిజన సంక్షేమ శాఖమంత్రి, ఎమ్మెల్యేలను పలుమార్లు కలిసి ఏడాది కాలంగా తమ గోడు వినిపిస్తూ వచ్చారు. ఏ ఒక్కరూ వారి సమస్యను పట్టించుకోలేదని, పరిష్కారానికి కనీస చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందుతున్నారు. ఏళ్ల తరబడి గిరిజన సొసైటీలో టీచర్లుగా పనిచేస్తున్నాం.. రిటైర్‌మెంట్‌కు దగ్గర్లో ఉన్నాం.. న్యాయం చేయండంటూ అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. జాతీయ ఎస్టీ కమిషన్‌ను సైతం ఆశ్రయించారు. 45 రోజుల పాటు ఐటీడీఏ ఎదుట రిలేనిరాహార దీక్షలు, ధర్నాలు చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.
సీతంపేట: గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్టున్న అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మెగా డీఎస్సీలో పోస్టులను భర్తీ చేయడంతో 1143 మంది టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించలేదు.. మీ ఉద్యోగాలు మీరు చేసుకోండంటూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి చెప్పుకొస్తున్నా బెంగ వీడడంలేదు. రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అర్థాకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ ఉద్యోగాలు ఉన్నాయో, ఊడిపోయాయో తెలియక మదనపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా వివిధ కేడర్‌లలో అవుట్‌సోర్సింగ్ విధానంలో 1633 మంది పనిచేస్తున్నారు. మెగా డీఎస్సీలో వీరి పోస్టులు కలిపివేయడంతో 1143 మంది రెగ్యులర్ టీచర్లు వారి స్థానంలో విధుల్లో చేరారు. చివరకు అవుట్‌సోర్సింగ్ టీచర్లంతా గిరిజన మంత్రిని కలిస్తే మీకు ఉద్యోగంలో నుంచి ఎవరినీ తీయలేదని, స్కూళ్లకు వెళ్లి పనిచేసుకోవాలని చెప్పారు. మన్యం జిల్లాలో సుమారు 200ల మంది అవుట్‌సోర్సింగ్ టీచర్ల ఉద్యోగాలపై సందిగ్దత నెలకొంది. కొందరికి అర్హతను బట్టి స్కూల్స్ నుంచి కళాశాలలకు వర్క్ ఎడ్జ్‌స్ట్‌మెంట్ పేరుతో ఇటీవల నియమించారు. ఎవరికీ ఇంతవరకు ఎటువంటి జీతాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు వీరికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు కూడా ఆరుదశల విచారణ పేరుతో కోత విధించడం గమనార్హం.


