
విలవిల
సీజనల్ వ్యాధులతో..
ఆరు నెలల్లో 1224 మలేరియా,
8 డెంగీ కేసులు
గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచి జూన్ నెలాఖరు వరకు అధికారికంగా 1224 మలేరియా కేసులు, 8 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇది కాకుండా గిరిజన గ్రామాల్లో జ్వరాల బారిన పడి రక్త పరీక్షలు చేయించుకోకుండా ఆర్‌ఎంపీల వద్ద చికిత్స పొందుతున్న వారు వేలల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు గతంలో మాదిరిగానే గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
నేను పార్వతీపురం ఎస్సీ వసతిగృహంలో ఉంటున్నాను. గత రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిందని జిల్లా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించి ఏమీ చెప్పడం లేదు. ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఒకే బెడ్ మీద ఇద్దరం ఉంటున్నాం. మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలి.
– సిద్దు, గిరిజన సంక్షేమ వసతిగృహం,
పార్వతీపురం
పట్టించుకోవడం లేదు..
మా అబ్బాయి అరుణ్‌కుమార్‌కు జ్వరం వచ్చిందని జిల్లా ఆసుపత్రికి వచ్చాం. ఆసుపత్రిలో చేరమని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరినా సరైన సౌకర్యాలు లేవు. ఒక బె బెడ్‌పైన ఇద్దరిని ఉంచారు. సకాలంలో వైద్యులు వచ్చి చికిత్సను అందించడం లేదు. రక్త పరీక్షలు చేస్తున్నారే తప్ప సరైన ఫలితాలు చెప్పడం లేదు. అధికారులు ఇప్పటికై నా స్పందించాలి.
– మెల్లక లక్ష్మి, టేకులోవ గ్రామం
నివారణ చర్యలు చేపట్టాం
మలేరియా నివారణకు చర్యలు చేపట్టాం. మలేరియా ప్రభావిత గ్రామాలను గుర్తించి తొలి విడత స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాం. వసతిగృహాలు, పాఠశాలలు వద్ద తొలి విడత స్ప్రేయింగ్ పూర్తి చేశాం. గ్రామాల్లో పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నాం. 178 చెరువుల్లో గంబూషియా చేపలను విడుదల చేశాం.
– వై.మణి, జిల్లా మలేరియా అధికారి,
పార్వతీపురం మన్యం
పార్వతీపురం టౌన్: మన్యం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు తోడు ఫ్రైడే – డ్రైడే అమల్లో అధికారుల నిర్లక్ష్యం ప్రజలను వ్యాధుల బారిన పడేస్తోంది. మరోవైపు పరిసరాల పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల మురుగు ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో మలేరియా కేసులు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఆసుపత్రి జ్వర పీడితులతో కిటకిటలాడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఫ్రైడే – డ్రైడే ఫొటో పోజులకే పరిమితమవుతుండడంతో సీజనల్ వ్యాధులు మరింత విజృంభిస్తున్నాయి. ఫలితంగా పదుల సంఖ్యలో మలేరియా, టైఫాయిడ్ బాధితులు జిల్లా ఆసుపత్రిలో చేరుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న ఇద్దరేసి రోగులకు ఆసుపత్రిలో ఒకే బెడ్ కేటాయిస్తున్న పరిస్థితి ఉందంటే అర్ధం చేసుకోవచ్చు.
తూతూ మంత్రంగా..
వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా నివారణకు సంబంధించి తూతూ మంత్రంగానే అధికారులు వ్యవహరిస్తున్నట్టు కన్పిస్తుంది. ముందస్తుగా చెరువుల్లో సరఫరా చేయాల్సిన గుంబూషియా చేపల విడుదల కేవలం 178 చెరువుల్లోనే చేపట్టారు. మలేరియా నివారణకు గ్రామాల్లో నిర్వహించాల్సిన పారిశుధ్య పనుల సైతం నిర్వహించలేనట్టు తెలుస్తోంది. మలేరియా, విషజ్వరాల నియంత్రణకు అధికారులు తగు చర్యలు చేపట్టకపోవడం కారణంగా మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభించి గిరిజనులు ఆస్పత్రిలో చేరుతున్నారు.
జిల్లాలో 1915 మలేరియా రిస్క్ గ్రామాలు
జిల్లా వ్యాప్తంగా మలేరియా కేసులు ఎక్కువగా ఉన్న 1915 గ్రామాలను మలేరియా రిస్క్ గ్రామాలుగా గుర్తించారు. అధిక సంఖ్యలో మలేరియా కేసులు నమోదవుతున్న 248 గ్రామాలను హైరిస్క్ గ్రామాలుగా గుర్తించారు. గతంలో ఈ గ్రామాల్లో ప్రతీ ఏటా రెండుసార్లు మలేరియా నిర్మూలనకు స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించేవారు. కేవలం 915 గ్రామాల్లో ఐఆర్‌ఎస్ మొదటి దశ స్ప్రేయింగ్ మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం మలేరియా స్ప్రేయింగ్ ఒకేసారి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వసతిగృహాలు, గ్రామాల్లో మలేరియా నివారణకు మందుల పిచికారీ జరగడం లేదని ప్రజలు చెబుతున్నారు.

విలవిల

విలవిల

విలవిల

విలవిల