
అమలు కాని గిరిజన పథకాలు!
సీతంపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా గిరిజనాభివృద్ధికి సంబంధించిన కొన్ని పథకాలకు అతీగతి లేదు. దీంతో గిరిజనాభివృద్ధి అటకెక్కిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏలో కీలక విభాగాలైన వ్యవసాయ, ఉద్యాన శాఖ ద్వారా అమలు చేయాల్సిన పథకాలు చతికలపడ్డాయి. అంతకముందున్న వేగం ఇప్పుడు లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైతే, ప్రస్తుత ప్రభుత్వంలో ఎవ్వరూ పట్టించుకున్న వారు లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఫలాలు గిరిజనులకు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన ఉప ప్రణాళికలో ఐటీడీఏ ద్వారా అన్ని శాఖలలాగే ముఖ్యమైన శాఖలు రెండు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ శాఖ దీనితో పాటు అనుబంధ శాఖగా ఉన్న హర్టీకల్చర్. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్, రబీ పనులు సాగుతున్నాయి. జిల్లాలో ఐటీడీఏ సబ్‌ప్లాన్ పరిధిలో 18 మండలాలు ఉన్నాయి. 15 వేల గిరిజన కుటుంబాలు 12వేల హెక్టార్ల వరకు సాగు చేస్తున్నారు. హార్టీకల్చర్ ఆధ్వర్యంలో జీడి, మామిడి తోటల పెంపకం, పసుపు, పైనాపిల్ వంటి అంతర్ పంటలను సాగు చేస్తుంటారు. సాగుకు రైతులకు కావాల్సిన యంత్ర సామగ్రి గతంలో సమకూర్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ సోమవారం ఐటీడీఏ పరిధిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు సైతం అర్జీలు ఇస్తున్నా ఫలితం లేదని పలువురు గిరిజన రైతులు వాపోతున్నారు.
మూలుగుతున్న రూ.76 కోట్లు
రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల పరిధిలో ఉద్యాన, వ్యవసాయ శాఖల ద్వారా వివిధ పథకాలు అమలు చేయడానికి ప్రత్యేక సహాయక కేంద్ర నిధులు, గిరిజన ఉప ప్రణాళికలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.76 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కో ఐటీడీఏకు సుమారు రూ.10 కోట్లు వరకు కేటాయింపులు జరిగాయి. వీటితో రైతులకు ఉపయోగపడే పవర్‌టిల్లర్లు, మినీ ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లు, టార్పలిన్‌లు, పవర్‌వీడర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు వంటివి కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేయాలి. రాష్ట్ర హర్టీకల్చర్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నప్పటకీ ఆ నిధులు ఉన్నాయా, వేరే పథకాలకు మళ్లించారనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరో ఏడాది అయితే ఆ నిధులు రద్దు అయ్యే ప్రమాదముంది. గతంలో ఏ ఐటీడీఏకు ఆ ఐటీడీఏ నిధులు కేటాయింపులు చేసి టెండర్ల ప్రక్రియ ద్వారా పరికరాలు కొనుగోలు చేసి పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఏకమొత్తంలో రాాష్ట్ర స్థాయిలో టెండర్ల ప్రక్రియ నిర్వహించడం ద్వారా పంపిణీ చేయడానికి ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. అయితే ఏడాదిగా ప్రతిపాదనే తప్ప ఫలితం కనిపించే పరిస్థితి లేదు. కొన్నేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన యంత్ర పరికరాలు తుప్పు పట్టి మూలన పడ్డాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట
మా ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైతే ఇంతవరకు రైతులకు పరికరాలు సప్‌లై చేయకపోవడం అన్యాయం. కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చేయడం కష్టసాధ్యమైన పని. యంత్రాలు ఇస్తే కొంతమేర రైతులకు ఉపయోగపడతాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలి. గిరిజనులకు రావాల్సిన పథకాలు వారికి ఇవ్వాలి.
– విశ్వాసరాయి కళావతి,
పాలకొండ మాజీ ఎమ్మెల్యే
ఎటువంటి పరికరాలు ఇవ్వలేదు
ఉద్యాన, వ్యవసాయ శాఖలకు సంబంధించి ఎటువంటి పరికరాలు మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. పలుమార్లు వినతులైతే ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రైతులకు ఉపయోగపడే వివిధ రకాల పరికరాలు పంపిణీ చేయాలి.
– ఎస్.పాయికుమార్, మాజీ సర్పంచ్, మండ
చతికిలపడిన వ్యవసాయ, ఉద్యాన శాఖల పథకాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిధుల మంజూరు
రూ.76 కోట్లు విడుదలైనా.. పరికరాల పంపిణీ లేదు..
ప్రభుత్వం వద్ద మూలుగుతున్న నిధులు
కూటమి సర్కార్ వచ్చి ఏడాదైనా అతీగతి లేదు..

అమలు కాని గిరిజన పథకాలు!

అమలు కాని గిరిజన పథకాలు!