
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను చెల్లించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.
మద్యం తాగి వాహనాలు నడిపిన 14 మందికి జరిమానా
మక్కువ: మద్యం తాగి వాహనాలు నడిపిన 14 మందికి సాలూరు జేఎఫ్‌సీఎం కోర్టు జరిమానా విధించినట్లు ఎస్సై ఎం.వెంకటరమణ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటరమణ మాట్లాడుతూ ఇటీవల మండల కేంద్రం మక్కువ సరిహద్దుల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, 14 మంది వాహనచోదకులు మద్యం తాగి వాహనాలు నడపడంతో కేసులు నమోదు చేశామన్నారు. మంగళవారం 14 మంది నిందితులను సాలూరు కోర్టులో హాజరుపరచగా, ఒక్కో వ్యక్తికి రూ. పదివేలు చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు. రెండవసారి మద్యం తాగి వాహనాలను నడిపి పట్టుబడితే, ఆ వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు, జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయమూర్తి హెచ్చరించారని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
పట్టపగలే చోరీ
● 2.5తులాల బంగారం,
లక్ష నగదు అపహరణ
సాలూరు రూరల్: మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ధన్‌రాజు ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 2.5 తులాల బంగారం లక్ష రూపాయల నగదు చోరీకి గురైనట్లు ఎస్సై నరసింహమూర్తి తెలి పారు. గ్రామంలో టిఫిన్ హోటల్ నడుపుతున్న ధన్ రాజ్ హోటల్‌లో బిజీగా ఉన్న సమయంలో ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులు వెల్ల డించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పాముకాటుతో యువకుడి మృతి
సీతంపేట: మండలంలోని చెక్కాపురం గ్రామానికి చెందిన మండంగి సంతోష్‌కుమార్ (31) పాముకాటుకు గురై మంగళవారం మృతిచెందాడు. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విషసర్పం మెడపై కాటు వేయడంతో వెంటనే కుటుంబసభ్యులు దోనుబాయి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేయగా అక్కడికి తీసుకువెళ్లేసరికి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సంతోష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దోనుబాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
యువతి ఆత్మహత్య
గంట్యాడ: మండలంలోని రామవరం మధురగ్రామం కరకవలస గ్రామానికి చెందిన చుక్క సత్యవేణి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయట నుంచి వచ్చిన యువతి తండ్రి ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని తమ కుమార్తె వేలాడుతోంది. కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. కడుపునొప్పి తాళ లేక తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తండ్రి అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు.
13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
సాలూరు: పట్టణంలో 13 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ, ముందస్తు సమాచారం మేరకు పట్టణంలోని ఎరుకుల వీధిలో ఓ బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న 13మంది పేకాటరాయుళ్లను పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ.23,800, రెండు సెల్‌ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

పుష్పాలంకరణలో పైడితల్లి