
సుపరిపాలనలో స్థానిక ప్రచారం!
● ఇంటింటికీ కాదు.. తూతూమంత్రంగా నిర్వహణ ● ముందుగానే గుర్తించిన ఇళ్ల సందర్శన ● పాలకొండలో పాల్గొనని ఎమ్మెల్యే ● శివరాంపురంలో సర్పంచ్‌ను టార్గెట్ చేసిన మంత్రి
సాక్షి, పార్వతీపురం మన్యం: సుపరిపాలనలో తొలి అడుగు అంటూ.. ఏడాది పాలనపై కూటమి ప్రభు త్వం చేపట్టిన ఇంటింటా ప్రచారం నామమాత్రంగా సాగింది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రచార ఆర్భాటంగా చేపట్టారు. నిలదీతలు ఉండొచ్చన్న అనుమానంతో ముందే గుర్తించిన కొన్ని ఇళ్లను సందర్శించి ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. పాలకొండలో మరోసారి వర్గ పోరు బహిర్గతమైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి వేరుగా కార్యక్రమం నిర్వహించా రు. జనసేన ఎమ్మెల్యే అసలు కార్యక్రమమే చేపట్టలేదు.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం..
సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. కొన్ని ఇళ్లను సందర్శించిన మంత్రి.. అనంతరం స్థానిక పాల ఉత్పత్తిదారుల సంఘ భవనంలోనే గ్రామస్తులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంలో సాధించిన దాన్ని వివరించండం కంటే.. గత ప్రభుత్వంపై విమర్శలు, స్థానిక సర్పంచ్ జర్జాపు మోహన్ లక్ష్యంగా దాడికి దిగారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీ తీర్మానం లేకుండానే పనులు చేపడుతున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిలో శివరాంపురం సర్పంచ్ మోహన్ ఒకరు. దీంతో ఆమె.. సర్పంచ్‌పై నిప్పులు చెరిగారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న ఇటువంటి సర్పంచ్ అవసరమా? అంటూ ప్రశ్నించారు.
స్థానిక టీడీపీ నాయకుడు భాస్కర్‌ను చూపిస్తూ.. ఇక్కడి ప్రజలకు అండగా ఉంటారని, ఏ అవసరం వచ్చినా సంప్రదించాలని చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో సదరు భాస్కర్‌నే సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారంలో ఉండటం గమనార్హం. సచివాలయాన్ని సందర్శించిన సమయంలోనూ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారా? అంటూ నిలదీశారు. పంచాయతీ ల అభివృద్ధికి తాము నిధులిస్తున్నప్పటికీ పనులు చేయకుండా అడ్డు తగులుతున్నారని సర్పంచ్ మోహన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
●పార్వతీపురం మండలం బంటువానివలస గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కేవలం 20లోపు ఇళ్లనే సందర్శించారు. ముందుగానే ఆయా ఇళ్లను గుర్తించి, ఎమ్మెల్యేను తిప్పి పంపినట్లు తెలుస్తోంది. కార్యకర్తల ఇళ్లకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. స్థానిక నాయకులెవరూ అంతగా ప్రాధాన్యమివ్వకపోవడం గమనార్హం. పింఛన్లు, రోడ్లు, కుళాయి వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు.
●పాలకొండ నియోజకవర్గంలో కూటమిలోని జనసేనకు చెందిన నిమ్మక జయకృష్ణ ఎక్కడా పాల్గొనలేదు. భామిని మండలం పశుకుడిలో టీడీ పీ నియోజకవర్గ ఇన్‌చార్జి తన అనుచరులతో నామమాత్రంగా వేరుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఇక్కడ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కురుపాంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొనగా.. ఇక్కడ కూడా నామమాత్రంగా సందర్శించి వెళ్లిపోయారు.