
గిరిజన బిడ్డల చదువు కష్టాలు!
●అధ్వానంగా పాఠశాలలు ●వసతిలేని బడి ●కనీస సదుపాయాలు కరువు
మక్కువ:
గిరిజన బిడ్డలకు చదువు కష్టాలు వెంటాడుతున్నాయి. పక్కాభవనాలు లేకపోవడంతో చెట్లకింద, వంటషెడ్‌లు, సామాజిక భవనాలు, రేకులషెడ్‌లు, పూరిపాకల్లో అక్షరాలు నేర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పకతప్పదు. తమ పిల్లలు నిరక్ష్యరాస్యులుగా మిగిలిపోకూడదని, కష్టపడైనా పిల్లలను మంచి చదువులు చదివిద్దామని గిరిజన చిన్నారుల తల్లిదండ్రులు ఆశపడుతున్నా.. పిల్లలు చదువులు సాగించేందుకు కనీస సదుపాయాలు లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. పాఠశాలల విలీనంతో కష్టాలు మరింత ఎక్కువయ్యాయని వాపోతున్నారు. గిరిశిఖర గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం, ఆర్థిక స్థితిగతులు అంతంతమాత్రం కావడంతో, సుదూర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఆ చిన్నారులను చదువులకు పంపించలేకపోతున్నామని చెబుతున్నారు. గిరిజన, సీ్త్ర శిశుసంక్షేమ శాఖమంత్రిగా కొనసాగుతున్న గుమ్మడి సంధ్యారాణి ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినా గిరిజనుల సంక్షేమం, పిల్లల చదువులను కనీసం పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.