
శతశాతం జీఎస్టీ వసూలు కావాలి
పార్వతీపురం టౌన్:
జిల్లాలో వాణిజ్య, వాణిజ్యేతర సంస్థల నుంచి శతశాతం జీఎస్టీ వసూలు కావాలని, ఆ దిశగా చర్య లు చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఆదాయం తెచ్చిపెట్టే శాఖలైన గనులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎల్డీఎం, డీపీఓ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూ ఎస్, ఐటీడీఏలు, మున్సిపాలిటీలు, పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ శాఖలకు చెందిన అధికారులు తమ వద్ద ఉన్న జాబితాలను వాణిజ్య పన్నుల శాఖకు అందజేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జీఎస్టీ వసూళ్లపై సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆస్తి పన్నులో కూడా జీఎస్టీ వసూలయ్యేలా చొరవ తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వత్తి పన్ను వసూలు కావాలన్నారు. జీఎస్టీ వసూళ్లపై డీడీఓలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. టీడీఎస్ చెల్లింపులపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో రిజిస్టర్ కాబడిన వాణిజ్య వ్యాపారాలు, నూతన భవనాలు, ఇతర సముదాయాల మేరకు పన్నులు వసూలు చేసుకునేందుకు వీలుగా జాబితాలను వాణిజ్య పన్నుల శాఖకు అందజేయాలని తెలిపారు. మండల, గ్రామ స్థాయిలో ఆస్తి, ఇతర పన్నులు సక్రమంగా వసూలు చేసేలా గ్రామ సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓలు అందజేయాలని స్పష్టం చేశారు. జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అందుకు గల కారణాలను తెలుసుకోవాలన్నారు.
అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జున మాట్లాడుతూ జిల్లాలో జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తమ శాఖల ద్వారా చేపడుతున్న పనుల వివరాలను తమకు అందజేయడం ద్వారా జీఎస్టీ వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారుల సమన్వయంతో వసూలు చేసేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ మోహనరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్‌ఓ డా.ఎస్.భాస్కరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఎల్డీఎం ఎన్.విజయ్‌స్వరూప్, డీపీఓ టి.కొండలరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇ.అప్పన్న, మున్సిపల్ కమిషనర్ సీహెచ్. వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి ఓ.ప్రభాకరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పీఎం సూర్యఘర్‌పై ప్రత్యేక శ్రద్ధ
పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటు, పీఎం జన్‌మ న్ గృహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్ర సాద్ ఆదేశించారు. వారంలోగా ప్రగతి కనబరచకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో హెచ్చరించారు. లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు.
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్