
మంత్రి ఇలాకాలో తప్పని డోలీమోత..
సాలూరు/సాలూరురూరల్: డోలీమోతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో డోలీ మోతలు నిత్యకృత్యంగా మారాయి. సాలూరు మండలం కరడవలస పంచాయతీ ఎగువకాసాయివలస గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కూనేటి శ్యామల వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యుల సుమారు 5 కిలోమీటర్ల మేర రాళ్లదారిలో డోలీలో సువర్ణముఖి నదిని దాటి కురుకూటి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత మెరుగైన వైద్యసేవల కోసం సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డోలీ మోతలు లేకుండా కంటైనర్ ఆస్పత్రిని ఏర్పాటుచేశామని మంత్రి ప్రకటించిన కరడవలస పంచాయతీ పరిధిలోని ఎగువ కాసాయివలసకు చెందిన ఆశ వర్కర్‌నే డోలీలో తరలించడం గమనార్హం. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తామన్న మంత్రి సంధ్యారాణి ప్రకటనలకే పరిమితమవుతున్నారని, చేసేదేమీ లేదని సీపీఎం సాలూరు మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు విమర్శించారు. సాలూరు ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న ఆశవర్కర్ శ్యామలను ఆయన పరామర్శించారు. గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.

మంత్రి ఇలాకాలో తప్పని డోలీమోత..