● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే
గర్భిణులకు జేఎస్‌వై లబ్ధి
● ఏప్రిల్ నుంచి జూన్ 26వరకు 1842 మంది ఆన్‌లైన్‌లో నమోదు
● 1232 మందికి మాత్రమే నగదు జమ
● ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసిన కూటమి సర్కారు
విజయనగరం ఫోర్ట్: మాతాశిశు సంక్షేమానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి సర్కార్ గొప్పలు చెబుతోంది, కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలను ప్రోత్సహించడం కోసం అందించే జేఎస్‌వై ప్రోత్సాహకాలు అందించడంలో కూటమి సర్కార్ అలసత్వం వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందరికీ కాకుండా కొంతమందికి ఇచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద ఇచ్చేది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసవాలు జరిగే ఆస్పత్రులు జిల్లాలో ఎస్.కోట, గజపతినగరం, రాజాం, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రులు, బాడంగి, నెల్లిమర్ల, భోగాపురం, బొబ్బిలి సీహెచ్‌సీలు, ఘోషాఆస్పత్రిలో ప్రసవాలు జరుగుతాయి. అదేవిధంగా జిల్లాలో ఉన్న 48 పీహెచ్‌సీల్లోనూ ప్రసవాలు జరుగుతాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే బాలింతలకు జననీ సురక్ష యోజన కింద ప్రోత్సాహకం (జేఎస్‌వై) అందజేస్తారు. గ్రామీణ ప్రాంత తల్లులకు రూ.1000, పట్టణ ప్రాంత తల్లులకు రూ.600 ఇస్తారు.
1842మంది తల్లుల నమోదు
ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి జూన్ 26వతేదీ నాటికి ఎంఎస్‌ఎస్ పోర్టల్‌లో 1842 తల్లులు వివరాలు అప్‌లోడ్ చేశారు. అందులో 1232 మందికి మత్రమే నగదు జమ అయింది. 610 మందికి జేఎస్‌వై ప్రోత్సాహకం అందాల్సి ఉంది.
మిగిలిన వారికి త్వరలో అందజేత
జేఎస్‌వై కింద గ్రామీణ ప్రాంత మహిళలకు రూ.1000, పట్టణ ప్రాంత మహిళలకు రూ.600 చొప్పన ప్రోత్సాహకం అందించనున్నాం. ఈ ఏడాది ఇంతవరకు 1842 మందికి గాను 1232 మందికి ప్రోత్సాహకం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. మిగతా 610 మందికి కూడా త్వరలో వారి ఖాతాల్లో జమ అవుతుంది.
డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్‌ఓ