తాగునీటికి కటకట..! | - | Sakshi
Sakshi News home page

తాగునీటికి కటకట..!

May 17 2025 6:43 AM | Updated on May 17 2025 6:43 AM

తాగున

తాగునీటికి కటకట..!

పార్వతీపురంటౌన్‌: పార్వతీపురం మన్యం జిల్లాలో

తీవ్రంగా తాగునీటి ఎద్దడి నెలకొంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల గొంతెండుతోంది. అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా వర్షాలు కురవకపోవడంతో మన్యంలో చాలా చోట్ల భూగర్భ జలాలు, నదులు, చెరువులు అడుగంటాయి. అనేక చోట్ల బోర్లు మొరాయించాయి. రక్షిత నీటి పథకాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో జిల్లావాసులు తాగునీటికి కటకటలాడుతున్నారు. బిందెడు నీటి కోసం పరుగు పెడుతున్నారు. మరోవైపు వేసవిలో తాగునీటి సరఫరాపై అధికారుల ముందస్తు ప్రణాళిక కొరవడింది. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం కింద చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. కొన్ని గ్రామాల్లో ఇంటింటికి వేసిన కుళాయిలు దిష్టిబొమ్మల్లా మారాయి. పైప్‌లైన్ల లీకులు తదితర సమస్యలతో కొన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు చేరడంలేదు. కొందరికి బురద నీరే సరఫరా అవుతోంది. విధిలేని పరిస్థితుల్లో ఆ నీటినే తాగి జిల్లా వాసులు రోగాల బారిన పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు చెలమల నీటిపై ఆధారపడుతున్నారు. ఇంకొన్ని చోట్ల రెండు, మూడు రోజులకోసారి మాత్రమే తాగునీరు అందిస్తున్నారు. గిరిజనప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిలోమీటర్ల దూరంలో ఉన్న గెడ్డ, వాగు నీటినే గిరిజనులు వినియోగిస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రోజు తప్పించి రోజు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో తాగునీటి పరిస్థితిని ఆధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక వడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో రెండు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ, 451 పంచాయతీలున్నాయి. వాటి పరిధిలో 2,282 గ్రామాలున్నాయి. సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌లు 11, పీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌లు 808, ఎంపీ డబ్ల్యూస్కీమ్‌లు 491, సోలార్‌ స్కీమ్‌లు 407, డైరెక్ట్‌ పంపింగ్‌ స్కీమ్‌లు 1,525 ఉన్నాయి. బోర్లు 7,518 వరకూ ఉన్నాయి. అయితే వాటి ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలో జల్‌జీవన్‌మిషన్‌(జేజేఎం) పథకం కింద 2,013 పనులు మంజూరు చేశారు. ఇందులో 851 పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. వివిధ దశల్లో 703 పనులున్నాయి. అసలు ప్రారంభం కాని పనులు459 వరకూ ఉ న్నాయి. ఈ స్కీమ్‌ ద్వారా గతంలో 1,21,246 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో 65,959 కుళాయి కనెక్షన్లు మాత్రమే పూర్తిచేశారు. 55,287 కుళాయి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

జిల్లా కేంద్రంలో నాలుగురోజులకోసారి..

జిల్లాకేంద్రం పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 220 పైగా బోరుబావులున్నాయి. వాటి నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గతంలో జిల్లా కేంద్రంలో సుమారు రూ. 65కోట్లతో మెగా రక్షిత నీటి పథకం పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కూటమి నేతలు, అధికారులు ఈ పథకం ఊసే ఎత్తడం లేదు. మున్సిపాల్టీలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ప్రధాన పైప్‌లైన్‌, దానికి అనుసంధానించిన లింకు పైప్‌లైన్‌ల లీకుల కారణంగా తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వేసవికాలంలో కుళాయిల ద్వారా నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా రెండురోజులకోసారి నీటిని పంపిణీ చేస్తున్నారు.

గిరిజన ప్రాంతాల్లో చెలమలు, నేలబావులే దిక్కు

జిల్లాలో ఎక్కువశాతం గిరిజన ప్రాంతం ఉంది. గిరిజన ప్రాంతాల్లో, కొన్ని గిరిశిఖర గ్రామాల్లో తాగునీటి సమస్యకు గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో చెలమల నీటినే గిరిజనులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని మండలాల్లో తాగునీరు సరిగా అందక సమీపంలో గల వసతి గృహాలకు వెళ్లి నీటిని బిందెలతో తీసుకురావల్సిన పరిస్థితి ఏర్పడింది. భామిని, సీతంపేట మండలాల్లో కిలోమీటర్ల దూరం మహిళలు, గర్భిణులు నీటికోసం తహతహలాడాల్సిన పరిస్థితి నెలకొందని గిరిజనులు వాపోతున్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

జిల్లాకేంద్రంలో నాలుగురోజుల కోసారి సరఫరా

గిరిజన ప్రాంతాల్లో తాగునీటికి అవస్థలు

తూతూ మంత్రంగా క్రాస్‌ ప్రోగాం

ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచిన

నేతలు

జిల్లాలో నాలుగు తాగునీటి ప్రాజెక్టులు

డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తిచేస్తాం

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జల్‌జీవన్‌ మిషన్‌ పనులు డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తిచేస్తాం. 55,287 కుళాయి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వేసవి ఎద్దడిని నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా క్రాస్‌ ప్రోగ్రాం నిర్వహించాం. కొన్ని గిరిశిఖర గ్రామాలకు తాగునీటి ఇబ్బందులను గుర్తించాం. తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నాం. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాం.

–ఒ. ప్రభాకరరావు,

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి,

పార్వతీపురం మన్యం

తాగునీటికి కటకట..!1
1/1

తాగునీటికి కటకట..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement