
ఈశ్వరమ్మ కంటకన్నీరు
సాలూరు: మున్సిపాలిటీ మీ తాతగారిదా? మేము అధికార పార్టీలో ఉన్నాం అంటూ వయస్సు పైబడిన మహిళా మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మపై టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది చిట్టి ఆగ్రహంతో ఊగిపోయాడు, బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం పూర్తయిన తరువాత, మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న వార్డుల్లో నీటి సరఫరా కోసం నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాక్టర్ వాటర్‌ట్యాంకర్‌ను చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు ప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె వస్తున్న సమయంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది చిట్టి పండగ పనులపై ఆరోపణలు చేస్తూ చైర్‌పర్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ మీ తాతగారిదా? మేము అధికార పార్టీలో ఉన్నాం అంటూ కనీసం ఆమె వయస్సుకు విలువ ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు, టీడీపీ పట్టణాధ్యక్షుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆమైపె విరుచుకుపడడంతో శ్యామలాంబ తల్లి అంతా చూస్తుందని, ఎవరు తప్పు చేస్తే వారికి ఆ పాపం తగులుతుందని అంటూ చైర్పర్సన్ కంటనీరు పెట్టుకుంటూ చీర కొంగుతో తుడుచుకుంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ విషయం గుర్తించిన మున్సిపల్ వైస్ చైర్మన్ సంఘటనా స్థలానికి వచ్చి చైర్‌పర్సన్‌పై ఇలా మాట్లాడడం సమంజసం కాదని, పండగ పనుల నేపథ్యంలో అధికారులు అజెండాలో పెట్టిన అన్ని అంశాలను కౌన్సిల్‌లో ఆమోదించామని తామెప్పుడూ పండగ పనులకు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేదని, సహకరించామన్నారు. టీడీపీ కూటమి పెద్దలు ఈ పండగకు ప్రత్యేక గ్రాంట్లు తెస్తామని హామీలు ఇచ్చి తేలేక, చివరకు అప్పు (రియింబర్స్‌మెంట్)గా వచ్చిన రూ.2 కోట్లతో పండగ ముందు పనులు చేయించుకోలేక వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి రాజకీయాలకు దిగుతున్నారంటూ పలువురు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.