
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
● ఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి అప్పారావు
విజయనగరం క్రైమ్ : ఆర్టీసీలో కార్మికుల డిమాండ్లు గడువులోగా పరిష్కరించకుంటే సమ్మె తప్పదని నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) రాష్ట్ర కార్యదర్శి వి.అప్పారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం ఆర్టీసీ డిపో వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కోరుతున్న 38 డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదన్నారు. తమ డిమాండ్లపై ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే వినతిపత్రాలు అందజేశామన్నారు. తక్షణమే తమ డిమాండ్లపై స్పందించాలన్నారు. లేకుంటే సమ్మె నోటీసు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ధర్నాకు రాహుల్ అధ్యక్షత వహించగా దుర్గరాజు, విజయనగరం, ఎస్.కోట సంఘ కార్యదర్శులు రామారావు, చంద్రమౌళి, మహిళ ప్రతినిధులు సరిత, సుజాత, భాను, కుమారి తదితరులు పాల్గొన్నారు.