జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి, బాసంగి గదబవలస, వెంకటరాజపురం పంట పొలాల్లో సోమవారం సాయంత్రం ఏనుగులు దర్శనమిచ్చాయి. వరి, అరటి పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పిడుగు పాటుకు 11 గొర్రెలు మృతి
సీతానగరం: మండలంలోని సుభద్రదరి సీతారాంపురంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగు పాటుకు సీతారాంపురం గ్రామానికి చెందిన పాల్లె నీలయ్యకు చెందిన 11 గొర్రెలు మృతిచెందాయి. కాసేపట్లో ఇంటికి చేరుకునే సమయంలో పిడుగు రూపంలో నష్టం సమకూరిందంటూ పెంపకందారు లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ముగిసిన వార్షిక కల్యాణ మహోత్సవం
గరుగుబిల్లి: తోటపల్లి కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 8 నుంచి జరిగిన సీతారామస్వామివారి వార్షిక కల్యా ణ మహోత్సవం సోమవారంతో ముగిసింది. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, మంగళాశాసనం, పుణ్యాహ వచనం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సాయంతో కల్యాణోత్సవం నిర్వహించినట్టు అర్చకులు తెలిపారు.
జీతం విడుదల చేయండి
విజయనగరం ఫోర్ట్: సీహెచ్‌ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల)లకు వెంటనే ఏప్రిల్ నెల జీతం విడుదల చేయాలని జీహెచ్‌ఓలు మౌనిక, కనకదుర్గ కోరారు. తమ సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సీహెచ్‌ఓల సర్వీసును క్రమబద్ధీకరించాలని, ప్రతీనెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించా లని డిమాండ్ చేశారు. 30 శాతం జీతం పెంచా లని కోరారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓలు శ్రీను, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
పాలకుల వైఖరిలో మార్పుతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి
బొబ్బిలి: పాలకుల వైఖరిలో పూర్తిస్థాయి మార్పు వస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్య మని ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు రౌతు రామమూర్తినాయుడు అన్నారు. బొబ్బిలిలోని ఎన్‌జీఓ హోంలో ఉత్తరాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో రామమూర్తినాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న అపారమైన ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి చెందుతాం తప్ప రాజకీయల వల్ల కాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపన వంటి చర్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు మెరిగాని గోపాలం మాట్లాడుతూ స్థానిక గ్రోత్ సెంటర్‌లో స్థానికులకు ఉద్యోగాలు లేవన్నారు. కార్యక్రమంలో వెంకటనాయుడు, అప్పలరాజు, డి. సత్యంనాయుడు, రెడ్డి దామోదరరావు, చింతల శ్రీనివాసరావు, బొత్స గణేష్ పాల్గొన్నారు.