
రామతీర్థంలో వైభవంగా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా అర్చకస్వాములు చక్రతీర్థ స్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో పూర్ణాహుతి హోమం జరిపించారు. అనంతరం శ్రీ సుదర్శన స్వామి పెరుమాళ్లను రామపుష్కరిణి వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామికి చక్రస్నానం చేయించారు. తరువాత గ్రామ బలిహరణ, బాలభోగం జరిపించి యాగశాలలో సుందరకాండ హవనం నిర్వహించారు. సాయంత్రం ధ్వజా రోహణం చేపట్టి వేణుగోపాలుడి కల్యాణ మహోత్సవాలకు ముగింపు పలికారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, రామగోపాల్, భక్తులు పాల్గొన్నారు.

రామతీర్థంలో వైభవంగా పూర్ణాహుతి