
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు
శృంగవరపుకోట: మండలంలోని చామలాపల్లి గ్రామంలో సంచలనం రేకెత్తించిన హత్య కేసులో నిందితుడిని ఎస్.కోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చామలాపల్లిలో ఈనెల 7వ తేదీ సాయంత్రం నడుపూరు మురళి అనే వ్యక్తి గ్రామానికి చెందిన తొత్తడి ప్రసాద్‌పై దాడి చేసి తల నరికేసి హత్యకు వినియోగించిన కత్తి పట్టుకుని పరారయ్యాడన్నారు. నిందితుడి కోసం గాలిస్తుండగా బైక్‌పై విశాఖపట్నం వెళ్తున్నట్టు అందిన సమాచారంతో పోతనాపల్లి వద్ద అదుపులోకి తీసుకుని, హత్యాయుధాన్ని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తన తమ్ముడు ప్రసాద్‌ను మురళి హత్య చేసినట్లు మృతుడి అన్న బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు మురళి భార్యకు మృతుడు ప్రసాద్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మురళి హత్యకు పాల్పడినట్లు సీఐ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు.