
పట్టుబడిన ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు
● ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
● సుమారు రూ.5లక్షల సొత్తు స్వాధీనం
లక్కవరపుకోట: ఎస్.కోట నియోజకవర్గం పరిధిలోని వేపాడ, ఎల్.కోట, కొత్తవలస, జామి మండలాలతో పాటు విజయనగరం రూరల్ పరిధిలో గల పలు గ్రామాల్లో గడిచిన మూడు నెలల నుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు (16 కేవీ సామర్థ్యం) చోరీకి గురవుతున్న అంశం పోలీసులకు సవాల్‌గా మారింది.దీంతో పోలీసులు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు వేపాడ మండలంలోని అరకు–విశాఖ రోడ్డులో పాటూరు జంక్షన్ వద్ద ఆటోలో చోరీ సొత్తును తరలిస్తుండగా గురువారం పట్టుబడ్డారు. ఈ విషయమై సీఐ ఎల్.అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు నిందితులను, చోరీ సొత్తును విలేకరల సమావేశంలో ప్రదర్శించారు. ఈ కేసులకు సంబంధించి సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల మేరకు గడిచిన మూడు నెలల వ్యవధిలో ఎస్.కోట రూరల్, సర్కిల్ పరిధిలో వేపాడ మండలంలో–2, లక్కవరపుకోట మండలంలో–3, జామి మండలంలో–4, కొత్తవలస మండలంలో –2, విజయనగరం రూరల్ పరిధిలో ఒకటి మొత్తంగా 15 ట్రాన్స్‌ఫార్మర్‌లు చోరీకి గురయ్యాయి, ఈ మేరకు అప్పట్లో కేసులు నమోదు చేయగా దర్యాప్తు చేయగా వేపాడ మండలం పాటూరు గ్రామానికి చెందిన రుద్ర బంగారునాయుడు, కర్రి యుగేంద్ర, షేక్ సలీం, ముమ్మన ఆదిత్య, బొద్దాం గ్రామానికి చెందిన మహమ్మద్ అమీద్‌లతో పాటు పాటూరు గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడు ముఠాగా ఏర్పడి ట్రాన్స్‌ఫార్మర్‌లు దొంగిలిస్తున్నట్లు తెలిసిందన్నారు.
ముందస్తు సమాచారంతో మాటు వేసి..
ముఠా సభ్యులు చోరీ చేసిన సొత్తును విశాఖపట్నంలో అమ్మేందుకు ఆటోలో తరలించేందుకు పాటూరు జంక్షన్‌లో సిద్ధంగా ఉన్నట్లు అందిన సమాచారం మేరకు వేపాడ, ఎల్.కోట ఎస్సైలు సుదర్శన్, నవీన్‌పడాల్‌లు తమ సిబ్బందితో మాటువేసి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం విచారణలో నిందితులు నేరం అంగీకరించడంతో వారి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన ట్రాన్స్‌ఫార్మర్లలో గల కాపర్ వైర్లు, బ్యాటరీలు, సబ్‌మెర్సిబుల్ మోటార్లు, అల్యూమిలియం విద్యుత్ తీగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి కొత్తవలస కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎల్.కోట, వేపాడ, జామి ఎస్సైలు నవీన్‌పడాల్, సుదర్శన్, వీరజనార్దన్, పలువురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.