
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టండి
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: వంగర మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కరణం సుదర్శనరావుపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్‌వీ మాధవరెడ్డిని ఆయన బుధవారం కలిశారు. సుదర్శనరావుపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిర్వహించి బాధ్యులను శిక్షించాలని వినతిపత్రాన్ని అందజేశారు. దాడికి తెర వెనుక ఉన్నవారిని గుర్తించి శిక్షించాలన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్‌శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో నిరభ్యంతరంగా ప్రజల పక్షాన నిలిచేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం నడవాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరపాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, విజయనగరం ఎస్పీతో కూడా ఫోన్‌లో మాట్లాడి చర్చించినట్లు చెప్పారు. నిందితులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో కరణం సుదుర్శనరావు, అచ్చంనాయుడు, జగన్‌మోహన్‌రావు, పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులున్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దర్యాప్తును త్వరితగతిన చేపట్టి, నిందితులెవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవిధంగా పోలీసుశాఖ సమర్థవంతంగా పనిచేయాలి. ఇప్పటికే రాజాంలోని సుదర్శనరావును కలసి పార్టీ తరఫున మేమంతా ఉన్నామని భరోసాు ఇచ్చాం.
– టి.రాజేష్,
వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్
వంగర వైఎస్సార్‌సీపీ నేత సుదర్శనరావుపై హత్యాయత్నం దురదృష్టకరం
తెరవెనుక ఎవరున్నా సరే.. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే..
జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీకి వినతి