
ఇచ్చిన హామీని నెరవేర్చాలి
సాలూరు: అధికారంలోకి వస్తే జీఓ 3ను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు సంధ్యారాణి, నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో బుధవారం మాట్లాడారు. గతంలో సాలూరు మండలం జగ్గుదొరవలసలో షెడ్యూల్ గ్రామాల ప్రకటన కోసం గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టిన సమయంలో సంధ్యారాణి, భంజ్‌దేవ్‌లు షెడ్యూల్ గ్రామాల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మేరకు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ దినోత్సవం రోజున జీఓ 3 పునరుద్ధరిస్తామని సీఎం, మంత్రి చెప్పిన విషయం గిరిజనులందరికీ గుర్తుందన్నారు. ఇటీవల జీఓ 3 రద్దుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కారణమంటూ సంధ్యారాణి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. 2014–2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జీఓ 3 రద్దు కోరుతూ చేబ్రోలు లీలాప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం సరైన న్యాయవాదులను ఏర్పాటుచేసి జీఓపై పర్యవేక్షించకపోవడంతో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిందన్నారు. కోవిడ్ సమయంలో ఆ తీర్పును సుప్రీంకోర్టు వెలువరించిందని, వెంటనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసినట్టు వెల్లడించారు. ఈ నెల 8న క్యాబినెట్‌లో చర్చించి జీఓ 3ను పునరుద్ధరణకు ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. మంత్రి అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
జీఓ3ను పునరుద్ధరించాలి
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర