ఆడబిడ్డని చెప్పి.. పిండాన్నిచిదిమేసి.. | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డని చెప్పి.. పిండాన్నిచిదిమేసి..

Jun 23 2025 5:46 AM | Updated on Jun 23 2025 5:46 AM

ఆడబిడ్డని చెప్పి.. పిండాన్నిచిదిమేసి..

ఆడబిడ్డని చెప్పి.. పిండాన్నిచిదిమేసి..

తల్లి పొత్తిళ్లలో వెచ్చని ఆత్మీయ స్పర్శకు చిరునవ్వులొలకాల్సిన ఆ శరీరం.. చెత్తకుప్పల్లో మాంసపు ముద్దగా మారింది. పిండమై ఎదుగుతున్నప్పుడు భువిపైకి తీసుకొచ్చి ఊపిరి పోయాల్సిన డాక్టరే.. నిబంధనలను పక్కన పెట్టిన దుస్థితి. ఆడబిడ్డ వద్దని తల్లే నిర్దయగా నిర్ణయం తీసుకుంది. కానీ ఆ డాక్టర్‌ కాసుల కక్కుర్తితో ఒప్పుకోవడంతో అమ్మతనం ఓడిపోయింది. దీంతో ఆరు నెలల పిండాన్ని కర్కశంగా చిదిమేశారు. తీరా అబార్షన్‌ అయ్యాక మగబిడ్డ అని తెలిసి తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. ఇలాంటి అమానవీయ అబార్షన్లు తరచూ జరుగుతున్నా వైద్యాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

నరసరావుపేట టౌన్‌: సమాజంలో ఆడపిల్ల అనే వివక్ష నేటికీ చాపకింద నీరులా ప్రవహిస్తూనే ఉంది. భ్రూణహత్యల నిరోధక చట్టం వచ్చినా, కేసుల ఉచ్చులతో భయపెట్టినా ఆడబిడ్డపై కాసుల కత్తి ఘాట్లు పెడుతూనే ఉంది. లింగ నిర్ధారణ చేయొద్దంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు ఆస్పత్రుల వద్ద దిష్టిబొమ్మల్లా వేలాడుతున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ప్రాంతంలో కొందరు వైద్యుల కాసుల కక్కుర్తి ఆడబిడ్డలను భూమిపైకి రాకుండానే చిదిమేస్తోంది. తాజాగా పట్టణంలో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శంగా నిలుస్తోంది. వివరాలు... చిలకలూరిపేట పట్టణానికి చెందిన గర్భిణి కొన్ని నెలలుగా పల్నాడు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యశాలలో సేవల కోసం వచ్చింది. ప్రస్తుతం 6వ నెల గర్భంతో ఉంది. కడుపులో నొప్పిగా ఉండటంతో శనివారం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కు వచ్చింది. డాక్టర్‌ లింగ నిర్ధారణ చేసి పుట్టబోయేది ఆడ శిశువు అని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు ఆడ సంతానం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పవని లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. ఇదంతా చేయకూడదని తెలిసీ డాక్టర్‌ కూడా పట్టించుకోలేదు. పైగా ఆడబిడ్డ అని గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్‌ చేశారు. తర్వాత పిండాన్ని పరిశీలిస్తే పుట్టబోయేది మగ బిడ్డని తేలింది. ఎన్నో ఆశలతో మగ సంతానం కోసం ఎదురుచూస్తుంటే ఇలా చేశారంటూ దంపతులు బోరున విలపించారు. ఆస్పత్రి వైద్యులను నిలదీశారు. యాజమాన్యం సెటిల్‌మెంట్‌ చేసుకుంది.

యథేచ్ఛగా లింగ నిర్ధారణ

పట్టణంలోని కొన్ని స్కానింగ్‌ సెంటర్‌లతోపాటు వైద్యశాలకు అనుబంధంగా ఉన్న స్కానింగ్‌లలో లింగ నిర్ధారణ యథేచ్ఛగా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. కొందరు స్కానింగ్‌ నిర్వాహకులు ఇచ్చే సమాచారంతోనే భ్రూణహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదు.

చర్యలు తీసుకుంటాం

లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం చట్టరీత్యా నేరం. అబార్షన్‌ చేసి గర్భంలో పిండాన్ని తొలగించిన వ్యవహారంపై విచారణ జరుపుతాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ రవి

డీఎంహెచ్‌ఓ

నరసరావుపేటలో అడ్డగోలుగా

లింగ నిర్ధారణ పరీక్షలు

ఆడ బిడ్డ అని చెప్పి

అబార్షన్‌కు ఒప్పించిన వైనం

ఆరు నెలల పిండాన్ని చిదిమేసిన

డాక్టర్‌

అబార్షన్‌ చేశాక మగ బిడ్డ అని

తేలడంతో బోరుమన్న తల్లిదండ్రులు

సెటిల్‌మెంట్‌ చేసుకున్న

ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం

లింగ నిర్ధారణ పరీక్షలపై

చోద్యం చూస్తున్న వైద్యాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement