
అధిక ఆదాయ పంటలపై దృష్టి పెట్టాలి
నరసరావుపేట ఈస్ట్: తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు చెప్పారు. మండలంలోని నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లో సాగు చేసిన ఉద్యాన పంటలను గురువారం పరిశీలించారు. వ్యవసాయరంగంలో ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకొని రైతులు రెట్టింపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. సబ్సిడీలో అందించే సూక్ష్మ సేద్యం పరికరాల ద్వారా ఎరువుల వినియోగం, నీటి వినియోగం పొలంలో ప్రతి అంగుళానికి అందుతుందన్నారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి పదివేల సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
● రొంపిచర్ల మండలంలోని అన్నవరం గ్రామంలో రైతు లింగయ్యచౌదరి సాగు చేసిన జామతోటలో డ్రిప్పు సేద్యం పరికరాల పనితీరును పరిశీలించారు. నరసరావుపేట మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో పోతురాజు శివయ్య తోటలో వంగ, గులాబీ సాగును పరిశీలించారు. సూర్యఘర్ పథకం కింద తన ఇంటిపై సోలార్‌ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న శివయ్యను జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గుడ్లు, పాల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలని ఆదేశించారు. జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఆంజనేయులు, జిల్లా ఉద్యాన శాఖాధికారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు