
రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గంజాయి చాక్లెట్ల బ్యాగు గుర్తించిన
పోలీస్ జాగిలం
తెనాలి రూరల్: తెనాలి రైల్వే స్టేషన్‌లో పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో సోదాలు చేశారు. గుంటూరు మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ డి. శ్రీనివాస్ రెడ్డి, తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్‌బాబు, ఎస్‌ఐలు డి. రామకృష్ణ, ఎం. లక్ష్మీనారాయణరెడ్డి, ఎన్. ప్రకాశరావు, ఈగల్ టీమ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. డాగ్ స్క్వాడ్(మార్షల్)తో తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును పోలీసు జాగిలం గుర్తించగా, తనిఖీ చేయడంతో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు లభించాయి. బ్యాగును స్వాధీనం చేసుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాలి వరకు రన్నింగ్ రైళ్లలో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.