
డీఎస్సీ నియామకాలు త్వరగా చేపట్టాలి
చిలకలూరిపేట: డీఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా నియామకాలు నిర్వహించాలన్నారు. జూన్ నెలలో జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో డీఎస్సీ ఖాళీలు కూడా చూపించినందున మారుమూల ప్రాంతాలలో ఎక్కువ ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో త్వరగా మెరిట్ లిస్టు విడుదల చేసి తద్వారా సెలక్షన్ లిస్టు తయారు చేసి వెంటనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడకుండా నియామక ప్రక్రియ సత్వరం చేపట్టాలన్నారు. కొన్ని పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేని కారణంగా రిలీవర్లు లేక బదిలీలు ఆగి పోయాయన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వినుకొండ అక్కయ్య, చావలి మల్లేశ్వరరావు, మేకల కోటేశ్వరరావు, వడ్లాన జయప్రకాశ్, బొంతా రవి, చిలకా వీరయ్య, అట్లూరి శ్రీనివాసరావు, సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.