త్వరలో ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్లు
భువనేశ్వర్: రిజర్వేషన్ కౌంటరులో ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్లు జారీ చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. సాధారణ రైలు వినియోగదారుల సౌకర్యాలు మెరుగుపరచడం దీని లక్ష్యంగా రైల్వే శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలైలో ఆన్‌లైన్ తత్కాల్ టికెటింగ్ కోసం ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను ప్రవేశపెట్టారు. తదుపరి దశలో సాధారణ రిజర్వేషన్ల కోసం ఓటీపీ ఆధారిత ఆన్‌లైన్ రిజర్వేషన్ వ్యవస్థను అక్టోబర్‌లో అమలు చేశారు. ఈ రెండు ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకత పరిరక్షణకు ఓటీపీ వ్యవస్థ ఉపకరిస్తుంది. ఓటీపీ ఆధారిత తత్కాల్ రిజర్వేషన్ వ్యవస్థను రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నవంబర్ 17న ప్రారంభించింది. తొలి విడత కింద ఈ వ్యవస్థను 52 రైళ్లకు విస్తరించారు. దీనిలో భాగంగా రిజర్వేషన్ కౌంటర్‌లో తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికుడు రిజర్వేషన్ దరఖాస్తులో తెలిపిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ చేరుతుంది. ఓటీపీ ధృవీకరణ తర్వాత మాత్రమే టికెట్ ఖరారు అవుతుంది.


