‘కాసీపూర్ పీహెచ్‌సీ అటెండెంట్‌పై చర్యలు తీసుకోండి’
రాయగడ: కొడుకు మృతి చెందాడన్న బాధలో తాము ఉంటే మృతదేహం పోస్టుమార్టం చేశాక రెండు వేలు లంచం అడిగిన అటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి, అతడి కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని కలసి ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవిని ఆదేశిస్తు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి అందుకు సంబంధించిన నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. కాసీపూర్ సమితి గొరఖ్‌పూర్ పంచాయతీలోని కన్హుగుడ గ్రామంలో గత నెల 29 వ తేదీన గ్రామానికి చెందిన కొంబొమజ్జి కొడుకు తొరు మజ్జి (3) అనే బాలుడు ప్రమాదవశాత్తు సమీపంలో నదిలో పడి చనిపోయాడు. కాసీపూర్ పీహెచ్‌సీలో పోస్టుమార్టం చేశాక మృతదేహాన్ని ఇవ్వడానికి అటెండెంట్ లంచం అడిగాడు. దీనిపైనే బాలుడి తండ్రి ఫిర్యాదు చేశారు.


