ఒడిశా అప్పుల భారం అదుపులోనే ఉంది
● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి
భువనేశ్వర్: రాష్ట్రంలో అప్పుల భారం అదుపులోనే ఉంది. రాష్ట్ర రుణ భారం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) నిష్పత్తి 12.72 శాతం, వడ్డీ భారం 2.87 శాతానికి పరిమితం అయిందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం రాష్ట్ర శాసన సభకు తెలియజేశారు. ఈ గణాంకాలు ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్ బీఎం) చట్టం, 2005 ప్రకారం నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఝార్సుగుడ ఎమ్మెల్యే టొంకొధొరొ త్రిపాఠి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్ర ప్రధాన బకాయిలు రూ. 26,978 కోట్లుగా కొనసాగుతోంది. ఇది అనేక ఇతర రాష్ట్రాల కంటే తక్కువ అని అన్నారు. రాష్ట్ర రుణ పరిస్థితి వివేకవంతమైన ఆర్థిక నిర్వహణకు అద్దం పడుతుంది. ఈ చర్య ఆర్థిక భారం లేకుండా అభివృద్ధి ప్రాజెక్టులు మరియు సంక్షేమ పథకాలను చేపట్టడానికి రాష్ట్రానికి అనుకూలత కల్పిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో అక్టోబర్ చివరి నాటికి రాష్ట్ర సమగ్ర రుణ భారం రూ. 1,26,799 కోట్లు. వివిధ వనరుల నుంచి రాష్ట్రం తీసుకున్న రుణాలలో భారత ప్రభుత్వ రుణాలు రూ. 2,301.43 కోట్లు, ఓపెన్ మార్కెట్ రుణాలు రూ. 7,000 కోట్లు, నాబార్డ్ రుణాలు రూ. 824.36 కోట్లు, ఓఎంబీఏడీసీ రుణాలు రూ. 2,170 కోట్లు, క్యాంపా నిధులు రూ. 2,430 కోట్లు ప్రధాన రుణాలుగా వివరించారు. రాష్ట్రంలో జీఎస్‌డీపీ, రుణ వడ్డీ అనుపాతం 2.87 శాతం తేలికగా రుణాన్ని తీర్చడానికి అనుకూలతని నిర్ధారిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రజా కార్యక్రమాలకు ఎక్కువ నిధులను వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తోంది. రుణ స్థాయిలు మరియు వడ్డీ చెల్లింపులు రెండింటినీ అదుపులో నియంత్రిస్తుంది. ఇది రాష్ట్ర భవిష్యత్ వృద్ధికి శుభ సంకేతంగా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


