చొయితీ ఉత్సవాలకు శ్రీకారం
రాయగడ: ఈ నెల 26వ తేదీ నుంచి స్థానిక గొవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో చొయితీ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు సమితి వారీగా ఉత్సవాలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం జిల్లాలోని కాసీపూర్ మణికేశ్వరి మందిరం నుంచిఉత్సవాలకు శ్రీకారం చుడతారని వివరించింది. అలాగే రామనగుడ సమితిలో ఏడో తేదీన, కళ్యాణసింగుపూర్‌లో తొమ్మిదిన, కొలనారలో 11న, గుడారిలో 12న, మునిగుడలో 13న, చంద్రపూర్‌లో 13న, పద్మపూర్, బిసంకటక్‌లలొ 13న, గుణుపూర్‌లో 23వ తేదీన సమితి వారీగా ఉత్సవాలు జరుగుతాయని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.
71 వేల గంజాయి మొక్కలు ధ్వంసం
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని దుడకాబహాల్ సమీప అటవీ ప్రాంతంలో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు, అబ్కారీ, ఏపీఆర్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో నాశనం చేశారు. 71 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్టు అధికారులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో గంజాయి అక్రమంగా సాగవుతుందని సమాచారం మేరకు పోలీసులు స్పెషల్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి దాడులను నిర్వహించినట్లు సమాచారం. కాసీపూర్ అబ్కారీ శాఖ ఇన్‌స్పెక్టర్ విష్ణు పద బెహర, కళ్యాణసింగుపూర్ నుంచి సత్యనారాయణ దాస్, టికిరి ఐఐసీ విష్ణుబంధిని బాగ్ తదితరులు దాడుల్లో ఉన్నారు.


