పూరీ సముద్రంలోకి మురుగు నీరు
● ఆగ్రహించిన స్థానికులు
● రూ. 37 కోట్లతో వాట్కో ఆధునిక ప్రణాళిక
భువనేశ్వర్: పూరీ పట్టణ వ్యాప్తంగా ఉత్పన్నం అవుతున్న మురుగు నీరు బంకి ముఖ ద్వారం సమీపంలో సముద్రంలోకి నిరవధికంగా ప్రవహిస్తోంది. దీని పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు సముద్రంలో యథేచ్ఛగా చొరబడి పరిసరాలు దుర్గంధమయం అవుతున్నాయి. దుర్వాసనతో కూడిన పర్యావరణం, కలుషితమైన నీరు నిరంతర ప్రవాహం ఆరోగ్యం, పారిశుద్ధ్య సమస్యలను సృష్టిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో దుర్వాసన తీవ్రమైంది. ప్రభావిత ప్రాంతం చుట్టూ దోమల బెడద విపరీతంగా పెరిగింది. ఏ క్షణంలో ఏ మహమ్మారి రోగాలు ఈ ప్రాంతంలో తాండవిస్తాయోనని అంతు చిక్కని భయానక పరిస్థితులు పొంచి ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్ధి వ్యవస్థ మొరాయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుత ప్లాంట్ సముద్రపు నీరు కలుషితం కాకుండా నిరోధించడానికి అవసరమైన వడపోతను నిర్వహించడం లేదని పేర్కొన్నారు.
వాట్కో రూ. 37 కోట్ల ప్రాజెక్టు
వాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా (వాట్కో) బంకీ ముహాణొ వద్ద కొత్త మురుగు నీటి శుద్ధి వ్యవస్థను నిర్మించే ప్రతిపాదనను ప్రకటించింది. రూ. 37 కోట్ల అంచనా వేసిన ఈ ప్రాజెక్టులో సబరే శుద్ధి సాంకేతికత ఉపయోగించబడుతుంది. పూరీ పట్టణంలో రోజుకు 15 మిలియన్ లీటర్ల (ఎమ్‌ఎల్‌డీ) మురుగు నీరు ఉత్పత్తి అవుతుంది. దీంతో సముద్రంలో నీరు కలుషితం కాకుండా చేయడానికి ఈ ప్రాజెక్టు రూపొందించారు. అధికారుల సమాచారం ప్రకారం ప్రధాన కార్యాలయం ఆమోదంతో టెండర్ ప్రక్రియ పూర్తయింది. నిర్మాణం 6 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వాట్కో జనరల్ మేనేజర్ బిక్రమ్ రౌత్ తెలిపారు.


