పోక్సో చట్టంపై అవగాహన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్‌లో పోక్సో చట్టంపై అవగాహన శిబిరం ఆదివారం నిర్వహించారు. కొట్‌పాడ్ తాలూకా న్యాయ సేవా సమితి వారు నిర్వహించిన ఈ శిబిరంలో న్యాయ సేవా సమితి అధ్యక్షుడు, మెజిస్ట్రేట్ త్రిజీవ కుమార్ నందా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొట్‌పాడ్ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన శిబిరంలో త్రిజీవ కుమార్ నందా మాట్లాడుతూ.. విద్యార్థులు, ఉద్యోగులు, యువతులు, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని, బాధితుల కుటుంబాలు, బాధితులు తీరని నష్టానికి గురవుతున్నారన్నారు. అటువంటి వారికి న్యాయం చేకూర్చేందుకే పోక్సో చట్టం చేసినట్లు వెల్లడించారు. నేటి సమాజంలో మహిళలకు గౌరవించటం అందరి బాధ్యత అన్నారు. పాఠశాల పరిచాలన కమిటీ అధ్యక్షులు, న్యాయవాది పంకజ కుమార్ పాత్రో, ప్రభుత్వ న్యాయవాది కిశోర్ చంద్ర మిశ్ర, మహిళా న్యాయవాది బిద్యుత్ లత భక్షీ చట్టాలను వివరించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
మెళియాపుట్టి: ఎవరూ లేని సమయం చూసి తాళాలు వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన సంఘటన ఆదివారం పెద్దమడి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు జినగ చంద్రావతి గ్రామంలోని తన ఇంటి ముందు చిన్న పాన్‌షాప్ పెట్టుకుని జీవిస్తోంది. ఈమె భర్త చాలాక్రితం మృతి చెందారు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు అవ్వడంతో శ్రీకాకుళంలో నివాసముంటున్నారు. చంద్రావతి పెట్టుకున్న పాన్‌షాప్‌లో వ్యాపారం సరిగాలేక పదిరోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లింది. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే గేట్‌కు వేసిన తాళాలు వేసినట్లే ఉండి.. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువా తెరిచి రూ.5000ల నగదు, రెండు జతల చెవి పోగులు, పుస్తెలు దొంగలు దోచుకెళ్లారు. వెంటనే ఆమె మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇంటిని పరిశీలించారు.


