రాష్ట్రంలో 2,900 పిల్లలు అదృశ్యం
● అగ్రస్థానంలో ఖుర్ధా జిల్లా
భువనేశ్వర్: రాష్ట్రంలో జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు 2,975 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ వ్యవధిలో 11,337 పిల్లలు తప్పిపోయిన కేసులు నమోదయ్యాయని శనివారం జరిగిన శీతా కాలం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తెలిపారు. వీరిలో 8,362 మంది పిల్లలను గుర్తించి రక్షించారు. మిగిలిన 2,975 మంది బాలల జాడ గుర్తించే ప్రయత్నా లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభు త్వ పోలీసులు, బాలల సంక్షేమ సంఘాలు మరియు కమ్యూనిటీ వర్గాలు సమన్వయంగా గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని వివరించారు. సభలో సమర్పించిన జిల్లాల వారీ సమాచారం ప్రకారం ఖుర్ధాలో అత్యధికంగా తప్పిపోయిన పిల్లల కేసులు నమోదయ్యాయి. 785 ఫిర్యాదులు ఆధారంగా ఇప్పటివరకు 576 మంది పిల్లలను గుర్తించారు. బాలాసోర్‌లో 683 కేసులు నమోదు కాగా 114 మంది పిల్లలను మాత్రమే రక్షించగలిగారు. రాష్ట్ర స్థాయిలో ఈ జిల్లాలో అతి తక్కువ రికవరీ రేటుపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
ఏసీఏలో సమగ్ర గీతా పారాయణం
భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ గీతా జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా సమగ్ర గీతా సామూహిక పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమితి సభ్యులతో పలువురు ఔత్సాహిక సభ్యులు పాల్గొంటారని ఇటీవల బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు జి.ఆనంద రావు తెలిపారు. డిసెంబరు నెల 1వ తేదీన సమితి రజతోత్సవ సభా మందిరంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఔత్సాహిక అభ్యర్థులు సమితి కార్యదర్శి రాయప్రోలు సత్య సాయిని సంప్రదించాలని తెలిపారు.
మెడికల్ షాపు యజమానికి జరిమానా
రాయగడ: నిషేధిత గుట్కాను నములుతూ మెడికల్ షాపులో కూర్చొని వ్యాపార లావాదేవీలు చేస్తున్న మెడికల్ షాపు యజమానికి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రెండు వందల రూపాయల జరిమానా విధించారు. ఇకపై ఇటువంటి ప్రవర్తనకు స్వస్తి చెప్పాలని లేదంటే సంబంధిత లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. జిల్లాలోని గుడారిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గుడారిలోని మెడిక్ షాపులపై ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు పోలీసు, వైద్య సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. మెడికల్ షాపుల్లో కాల పరిమితి ముగిసిన మందులను పరిశీలించారు. అదేవిధంగా మందుల బ్యాచ్ నంబర్లను తనిఖీ చేశారు. గర్భనిరోధక మందుల కిట్లను డాక్టర్ల ప్రిస్కప్సన్ లేనిదే ఎవ్వరికీ విక్రయించకూడదని తాఖీదు చేశారు. అలాగే ప్రిస్కిప్సన్ లేకుండా చిన్నచిన్న రోగాల బారిన పడి మందుల షాపులను ఆశ్రయించే రోగులకు అధిక మోతాదులో యాంటీబయోటిక్ మందులను ఇవ్వకూడదని వివరించారు.
60 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని వద్దనుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితుడు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన షానుగా పోలీసులు గుర్తించారు. రాయగడ నుంచి విశాఖపట్నానికి వెళ్లే రైలులో గంజాయిని రవాణా జరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రభాత్ కుమార్ త్రిపాఠి, ఇన్‌స్పెక్టర్ బినయ్ ప్రకాష్ మింజ, అలోక్ నాయక్, ఏఎస్సై మానిక్ చంద్ర గౌడో, మలయ మాఝిలు ప్లాట్‌ఫారంపై తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో షాను అనుమానాస్పదంగా కనిపించడంతో అతని బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 2,900 పిల్లలు అదృశ్యం
రాష్ట్రంలో 2,900 పిల్లలు అదృశ్యం


