ఘనంగా వికసిత్ భారత్ యువజనోత్సవాలు
పర్లాకిమిడి: నేటి యువత ప్రగతికి సారథులని వక్తలు అన్నారు. వారి సృజనాత్మకతను, పరంపర కళానృత్యాల నైపుణ్యం ప్రదర్శించే వేదికే వికసిత్ భారత్ యువజనోత్సవాలని ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గునీ మఝి అన్నారు. స్థానిక బిజూ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన యువజనోత్సవాలను శుక్రవారం ప్రారంభించారు. ఉత్సవాలకు ఇతర అతిథులుగా పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహులు విచ్చేయగా, శుభ్రాంశు శేఖర్ పండా ముఖ్యవక్తగా వ్యవహరించారు. యువజనోత్సవాలలో మొత్తం అయిదు ఈవెంట్లు ఏర్పాటు చేశారు. వీటిలో విజ్ఞాన ప్రదర్శన, చిత్రలేఖనం, స్టోరీ రైటింగ్, వక్తృత్వం, డ్యాన్సు ఉంటాయని, జిల్లా వ్యాప్తంగా 400 మందికిపైగా కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని జిల్లా స్పోర్ట్స్ అధికారి త్రినాథ సాహు అన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా సెంచూరియన్ వర్సిటీకి చెందిన డాక్టర్ నారాయణ గౌడో, ప్రొఫెసర్ సాగర్ మైత్రే, డాక్టర్ సోమనాథ్ కుమార్ బెహారా, డాక్టర్ ప్రియబ్రత్ శతపథి (అసోసియేట్ ప్రొఫెసర్), డాక్టర్ బిప్లవ్ రంజన్ ప్రధాన్, మహారాజా బాలుర ఉన్నత పాఠశాల అసిస్టెంటు టీచర్ జగన్నాథ్ పట్నాయక్ వ్యవహారించారు. రెండు రోజుల పాటు యువజనోత్సవాలు జరుగుతాయని జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు తెలిపారు.
ఘనంగా వికసిత్ భారత్ యువజనోత్సవాలు


