సుపరిపాలనకు కీలకం: గవర్నర్
ఆధునిక ఆడిటింగ్ పద్ధతులు
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి శుక్రవారం ఆధునిక పాలన అవసరాలకు అనుగుణంగా ఆడిటింగ్ పద్ధతులను మార్చాల్సిన అవసరాన్ని ప్రతిపాదించారు. స్థానిక జయదేవ్ భవన్‌లో జరిగిన 5వ ఆడిట్ వారోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక ఆడిటింగ్ భవిష్యత్ దృష్ట్యా సాంకేతికత ఆధారిత విశ్లేషణాత్మక సమాచారంతో ఆకస్మిక ఒడిదొడుకుల అంచనాలతో ప్రజా వ్యయం, ఆర్థిక వ్యవస్థల పరిశీలనను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. డిజిటల్ ప్లాట్‌ఫారాలు, పెరుగుతున్న సంక్లిష్టమైన ప్రజా కార్యక్రమాలతో ఆడిట్ దృష్టిలో ప్రమాదాలను అంచనా వేయడం, నియంత్రణలను మెరుగుపరచడం, సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడాన్ని ప్రారంభించడం జరగాలన్నారు.
150 సంవత్సరాలకు పైగా ఆడిటింగ్ ప్రజా జవాబుదారీతనానికి పునాదిగా ఉంది. ప్రజా వనరుల బాధ్యతాయుతమైన, పారదర్శక వినియోగాన్ని నిర్ధారించడం ద్వారా పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేయడంలో ఆడిటింగ్ సహాయపడింది. లావాదేవీల నుంచి వ్యవస్థాగత ఆడిటింగ్‌కు మారాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రక్రియ వృత్తిపరమైన నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందని, కృత్రిమ మేధస్సు, అధునాతన విశ్లేషణల వాడకంపై ఆధారపడి ఉంటుందన్నారు. పారదర్శకత, సంస్థాగత విశ్వసనీయతను బలోపేతం చేయడానికి ముందస్తు, సమగ్ర మరియు సంప్రదింపుల ఆడిట్ ఫ్రేమ్‌వర్క్ అవసరాన్ని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) ఐఏఏఎస్ డి. సాహు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్–1) ఐఏఏఎస్ సుబు ఆర్. మాట్లాడారు.
సుపరిపాలనకు కీలకం: గవర్నర్


