యువత అన్ని రంగాల్లో రాణించాలి
● ఏడీఎం నవీన్ చంద్ర నాయక్
● రాయగడలో ప్రారంభమైన యువజనోత్సవాలు
రాయగడ: యువత అన్ని రంగాల్లో రాణించాలని అందుకు సాధన ఎంతో అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశం హాల్‌లో శుక్రవారం జిల్లా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువజనోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత తమ ప్రతిభను చాటుకునేందుకు ఇదో మంచి వేదికగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతీఒక్కరు సమయానికి అనుకూలంగా ప్రతిస్పందించాలని ఉన్న కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే తమ భవిష్యత్ ఉజ్వలంగా మారుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను ప్రోత్సాహించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని దీనిని సద్వినియోగపరుచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యవేత్త డాక్టర్ డి.కె.మహాంతి మాట్లాడుతూ.. మన రాష్ట్రం కళలకు పుట్టినిళ్లని అన్నారు. భిన్న సంస్కృతులు గల మన రాష్ట్రంలో ఎంతో మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర గౌరవాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని వారు కూడా తగిన సాధన చేసి వారి ప్రతిభను కనబర్చుకోవాలని అన్నారు. అనంతరం యువతీ, యువకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, న్యాయవాది బ్రజసుందర్ నాయక్, జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్, జిల్లా సాంస్కృతిక విభాగాధికారి సుస్మిత బౌరి ప్రసంగించారు.


