వైద్యానికి ఆర్థిక సాయం అందించండి
● కలెక్టర్‌కు మీడియా వెల్ఫేర్ కమిటీ వినతి
రాయగడ: వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలైన పాత్రికేయురాలు సుప్రియ షోడంగి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణికి జిల్లా మీడియా వెల్ఫేర్ కమిటీ సభ్యులు కోరారు. కమిటీకి చెందిన శివాజీ దాస్ నేతృత్వంలో సభ్యులు ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కులకర్ణి స్పందించి ప్రభుత్వ తరఫున బాధితురాలికి ఆర్థిక సహాయం అందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ట్రెజరీ రోడ్డు వద్ద నివాసముంటున్న పాత్రికేయుడు గొపి నాథ్ గౌడో వివాహం బుధవారం సంబల్‌పూర్ జిల్లాలోని కుచింద వద్ద జరిగింది. ఈ వివాహానికి బంధుమిత్రులు అదేవిధంగా పాత్రికేయురాలు సుప్రియ, శక్తిదాస్‌లు హాజరయ్యారు. వివాహం జరిగిన తరువాత రాత్రి తిరిగి వస్తున్న సమయంలో బొలేరో ఒక చెట్టుకు ఢీ కొనడంతొ అందులో ప్రయాణిస్తున్న వధువు సోదరి జ్యోత్స్నరాణి గౌడి అక్కడిక్కడే మృతి చెందగా సుప్రియ, శక్తిదాస్‌లు గాయపడిన విషయం విదితమే.
వైద్యానికి ఆర్థిక సాయం అందించండి


