చరిత్రాత్మకం
ఒడిశా శాసనసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
పాత రోజులు గుర్తు చేసుకున్న వైనం
ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సభ్యులకు సూచన
భువనేశ్వర్: ఒడిశా శాసన సభలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చరిత్రాత్మకంగా నిలిచింది. భావోద్వేగం, అంతర్ దృష్టితో కూడిన ఆమె ప్రసంగం ప్రజా ప్రతినిధులకు మార్గదర్శకత్వాన్ని ప్రతిబింబించింది. ప్రసంగం ఆద్యంతం ఒడిశా శాసన సభతో ఆమె బంధాన్ని ప్రస్ఫుటించింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ప్రతినిధుల జీవన శైలి వినయంతో కూడుకుని ప్రజల పట్ల జవాబుదారీతనంలో ఉండాలని నిర్దేశించింది.
ప్రసంగం సాగిందిలా..
అందరి మధ్య ఉండటం సంతోషంగా, గౌరవంగా అనిపిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తాను భారతదేశం అంతటా అనేక శాసన సభలను ఉద్దేశించి ప్రసంగించానని, కానీ ఇక్కడ మాట్లాడటం చాలా ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైనదని పేర్కొన్నారు. ఏ పదవిలో ఉన్నా, ఆ ఘనత ఈ సభకే చెందుతుందన్నారు. జగన్నాథుడి ఆశీస్సులు లేకుంటే తాను ఈ స్థాయికి చేరుకునే దానిని కాదన్నారు. ఈ సభలో ప్రయాణం ఓ మధుర స్మృతిగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా అనేక ప్రశ్నలు అడిగానని, ఇదే సభలో మంత్రిగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. గ్యాలరీలో మాజీ సహోద్యోగులను చూడడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజల చేతుల్లోనే సర్వం..
శాసన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నైతిక విలువల్ని వివరించారు. ప్రజా ప్రతినిధుల విధిని నిర్ణయించేవారు ప్రజలేనని స్పష్టం చేశారు. అపరిమిత అధికారం వారి చేతుల్లోనే ఉంటుందన్నారు. పాలన ప్రజల చేతుల్లోనే ఉంటుందని, శాసన సభ్యులు వారి ప్రతినిధులు మాత్రమేనని పేర్కొన్నారు. వారు ఎన్నో ఆశలు నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారని, వారి కలలను నెరవేర్చడం మీ విధి అని స్పష్టం చేశారు. అడుగడుగున జవాబుదారీతనంతో మెలగాలన్నారు.
పురోగతి జీవిత ప్రతిజ్ఞ..
ఒడిశా అన్ని రకాల వనరులతో తులతూగుతోందని ముర్ము పేర్కొన్నారు. 2036 నాటికి సంపన్న ఒడిశాను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రతినిథులు ఒడిశా పురోగతిని జీవిత ప్రతిజ్ఞగా స్వీకరించాలన్నారు. వికసిత భారత్ దార్శనికతకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ నేల యోధుడు చండ అశోకుడిని ధర్మ అశోకుడిగా మార్చిందన్నారు. డాక్టర్ హరే కృష్ణ మహాతాబ్, బిజూ పట్నాయక్ వంటి అనేక మంది రాష్ట్ర నిర్మాతలు ఉత్కళ తల్లి ఒడిలో ఎదిగి జాతికి వన్నె దిద్దారని గుర్తు చేశారు. నేడు సభని మహిళా స్పీకర్ నిర్వహించడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.
చరిత్రాత్మకం
చరిత్రాత్మకం
చరిత్రాత్మకం
చరిత్రాత్మకం


