సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చ
రాయగడ: మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుని, భావితరాలకు అందించాలని కొరాపుట్ ఎమ్మెల్యే, అవిభక్త కొరాపుట్ జిల్లా డొంబ్ సమాజం అధ్యక్షుడు రఘురాం మచ్చ అన్నారు . స్థానిక గొవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన డొంబ్‌సమాజ్ భేట్ ఘాట్–25 ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి యువత సంస్కృతి, సంప్రదాయాలను పట్టించుకోవడం లేదన్నారు. గత మూడు సంవత్సరాలుగా రాయగడలో డొంబ్ సమాజం ఆవిర్భవించి సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఎస్సీ వర్గాలకు చెందిన వారికి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్నారు. వారికి ఎస్టీ వర్గాలకు కల్పించేలా సౌకర్యాలు కల్పించడంతోపాటు రిజర్వేషన్ల సౌకర్యాలు కల్పించేలా అంతా కలిసి కట్టుగా పోరాడాలన్నారు. రాయగడ డొంబ్ సమాజం అధ్యక్షుడు ధనీరాం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాల్లో ముఖ్యవక్తగా భువనేశ్వర్ ఉత్కల విశ్వవిద్యాలయం సెంటర్ ఆఫ్ అంబేడ్కర్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ రవీంద్ర గరడియా, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరొజ్ నాయక్, నువాపడ జిల్లా ఉపాధ్యక్షురాలు దీపిక కౌసల్య, తదితరులు పాల్గొన్నారు. డొంబ్ సమాజం జిల్లా సాధారణ కార్యదర్శి జనార్దన్ గరడ సంఘం వార్షిక నివేదికను చదివి వినిపించారు. పట్టణంలో భారీ ఎత్తున ఊరేగింపులో యువతీ, యువకులు సంప్రదాయ పద్ధతిలొ కావుళ్లతో కూరగాయలు, తదితరమైనవి పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.
సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి


