నేడు శాసన సభలో రాష్ట్రపతి ప్రసంగం
● 4 అంచెల భద్రతా ఏర్పాట్లు
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో సరికొత్త చరిత్రకు శ్రీకారం పడుతోంది. గురు వారం రాష్ట్ర శాసన సభను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. శాసన సభ చరిత్రలో ఇదే తొలి సారి కావడం విశేషం. ఇదే సభలో ఆమె సభ్యురాలిగా ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. ఆ పాత జ్ఞాపకాల మననంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె శాసన సభ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించిన కార్యాలయం గదిని ప్రత్యేకంగా సందర్శించనున్నారు. మరో వైపు రాష్ట్రపతి సందర్శన పురస్కరించుకుని రాష్ట్ర శాసన సభ కొత్త ముస్తాబుతో స్వాగతించేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో శాసన సభ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్తగా ముస్తాబు
రాష్ట్రపతి శాసన సభ భవన సందర్శన పురస్కరించుకుని సమగ్ర శాసన సభ సముదాయాన్ని అందంగా తీర్చిదిద్దారు. గదులను పునరుద్ధరించారు. వర్ధమాన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రాజకీయ జీవితంలో గణనీయమైన భాగాన్ని శాసన సభలో ఎమ్మెల్యేగా, మంత్రిగా గడిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిగా సభలో ఆమె ప్రసంగించడం చిరస్మరణీయం, చారిత్రాత్మకం అవుతుందని శాసన సభ స్పీకర్ సురమా పాఢి అభివర్ణించారు. ఈ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర ఎంపీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరవుతారు. దేశాధినేత పర్యటన దృష్ట్యా నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు నివారణకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నాలుగు అంచెల భద్రతా కవచాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగే శీతాకాల సమావేశాల ముగింపు వరకు 33 ప్లాటూన్ల పోలీసులు శాసన సభ భవన సముదాయం భద్రత, రక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. విమానాశ్రయం నుండి శాసన సభ మార్గంలో అదనంగా 25 ప్లాటూన్లు పోలీసు దళాలు, యాంటీ టెర్రర్ స్క్వాడ్‌ను మోహరిస్తారని పోలీస్ కమిషనర్ ఎస్. దేవ్ దత్తా సింగ్ తెలిపారు.
రాష్ట్రపతి పర్యటన వేళలు
గురు వారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతారు. అత్యంత ప్రముఖ అతిథుల కోసం రూపొందించిన రాజ్ భవన్ సముదాయంలో కొత్తగా నిర్మించిన కళింగ అతిథి నివాస్‌ను ఆమె ప్రారంభించనున్నారు. ఆమె రాత్రికి అక్కడే బస చేస్తారు. సాయంత్రం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శాసన సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆమె గౌరవార్థం గవర్నర్ ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆమె న్యూఢిల్లీకి బయలుదేరుతారు.
శాసన సభతో రాష్ట్రపతి బంధం ప్రత్యేకం
ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి హోదాలో రాష్ట్ర శాసన సభ సందర్శించి ప్రసంగించడం ఆమె వ్యక్తిగత జీవితంలో మరో మైలు రాయిగా నిలుస్తుంది. ఈ సభతో అమెకి ఉన్న బంధం అపురూపం. ఆమె 2000 నుండి 2009 వరకు ఎమ్మెల్యేగా ఈ సభలో తళుక్కుమన్నారు. ఈ నిడివిలో 2 సార్లు మంత్రిగా బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. 2000 నుంచి 2002 వరకు వాణిజ్య, రవాణా, 2002 నుంచి 2004 వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖల మంత్రి పదవులు ఆమెని అలంకరించాయి.
11 నంబర్ గది జ్ఞాపకాల నిధి
శాసన సభలో ప్రసంగం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2000 నుంచి 2004 వరకు మంత్రిగా పని చేసిన సమయంలో శాసన సభ సముదాయంలో ఆమె మాజీ కార్యాలయమైన 11వ నంబర్ ఛాంబరుని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆమె తొలి రాజకీయ ప్రయాణ జ్ఞాపకాల అవలోకనంతో ఈ ఛాంబర్‌ను తాజాగా అలంకరించారు. లోగడ 2022 నవంబర్ నెలలో భారత రాష్ట్రపతి మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.


