బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యం
● అత్యంత కాలుష్య నగరంగా అంగుల్
భువనేశ్వర్: రాష్ట్రంలో వాయు నాణ్యత గణనీయంగా దిగజారి కాలుష్య తీవ్రతని తేటతెల్లం చేస్తుంది. ఈ పరిస్థితులు బెంబేలెత్తిస్తున్నాయి. వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్న ఢిల్లీ నగరం తరహాలో రాష్ట్రంలో వాయు నాణ్యత దిగజారుతున్నట్లు బుధవారం నాటి వాయు కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాలు సూచించాయి. ఈ గణాంకాల ప్రకారం అంగుల్ నగరంలో వాయు కాలుష్యం ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 339గా నమోదైనట్లు హకిమపడా ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (ఓఎస్‌పీసీబీ) స్టేషన్ ప్రకటించింది. ఇది భారత దేశంలో 6వ అత్యంత కాలుష్య నగరంగా మారింది. ఢిల్లీలో పలు చోట్ల నమోదైన స్థాయిలకు దగ్గరగా రాష్ట్రంలో కొన్ని చోట్ల వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ)ని నమోదు అయినట్లు ఓఎస్‌పీసీబీ తెలిపింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ 355 ఏక్యూఐ నమోదు చేయగా చాందిని చౌక్ 325 మరియు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం 328 ఏక్యూఐ నమోదు చేశాయి. రాష్ట్రంలో భువనేశ్వర్, కటక్ జంట నగరాల్లో అధిక వాయు కాలుష్య స్థాయిలు నమోదయ్యాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు జాతీయ వాయు నాణ్యత సూచిక ఏక్యూఐ ప్రకారం ఓఎస్‌పీసీబీ భువనేశ్వర్ లింగరాజ్ మందిర్ స్టేషన్ ఏక్యూఐ 328గా ప్రకటించింది. కటక్ నగరం సీడీఏ ఏరియా స్టేషన్ 324 ఏక్యూఐ నమోదు చేసింది. రాష్ట్రంలో ఇతర కాలుష్య నియంత్రణ బోర్డు స్టేషన్లు పటియా (భువనేశ్వర్) – 311, కాళిదాస్‌పూర్ (బాలాసోర్) – 249, తాల్చేర్ కోల్‌ఫీల్డ్స్ – 247 మరియు రౌర్కెలా ఫెర్టిలైజర్ టౌన్‌షిప్ – 99 ఏక్యూఐ ప్రకటించాయి.


