గుండిచా ప్రవేశ రుసుం రూ.10
భువనేశ్వర్: పూరీ శ్రీగుండిచా ఆలయం వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా తెరవనున్నారు. ఆలయ ప్రవేశానికి ఒక్కో భక్తుడు రూ.10 చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భక్తులు, 80 సంవత్సరాల పైబడిన, దివ్యాంగ భక్తులకు ప్రవేశం పూర్తిగా ఉచితం. భక్తులకు మొబైల్, షూ స్టాండ్‌లు, ఉచిత సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. గుండిచా ఆలయం నిత్యం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరవధికంగా తెరిచి ఉంటుంది. ఏడాదిలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. భక్తుల ప్రవేశం, నిష్క్రమణ సింహ ద్వారం గుండా ఉంటుంది. దివ్యాంగ భక్తుల కోసం ర్యాంప్ వ్యవస్థ అమలులో ఉంటుందని శ్రీమందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాడీ తెలిపారు.


