ఓఎంసీ ఆదర్శ పాఠశాల గదులకు విముక్తి
జయపురం: జయపురం సమితి ఉమ్మిరి పంచాయతీ ఫూల్‌బెడలోగల మైనింగ్ కార్పొరేషన్ ఆదర్శ పాఠశాల భవనం గదులు కాంట్రాక్టర్ కబ్జా నుంచి విముక్తి పొందాయి. రెండేళ్లుగా కాంట్రాక్టర్ కబంధ హస్తాల్లో ఉన్న మైనింగ్ కార్పొరేషన్ ఆదర్శ పాఠశాల క్లాస్ రూమ్ తాళాలను అధికారులు ఎట్టకేలకు తీశారు. ఈ పాఠశాలలో నిర్మించిన 3 తరగతుల గదులు రెండేళ్లుగా కాంట్రాక్టర్ కబ్జాలోనే ఉన్నాయని ఫిర్యాదు అందడంతో జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి వెంటనే ఆ క్లాసు రూమ్‌ల తాళాలు తీసి స్వాధీన పరచుకోవాలని అధికారులకు మంగళవారం ఆదేశం జారీ చేశారు. ఆ మేరకు జయపురం తహసీల్దార్ సబ్యసాచి జెన, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ నేతృత్వంలో పోలీసుల సహకారంతో మైనింగ్ కార్పొరేషన్, పాఠశాల కంట్రాక్టర్ కబ్జాలో ఉన్న మూడు రూమ్‌ల తాళాలు విరిచి స్వాధీన పరచుకున్నారు. అధికారుల వివరణ ప్రకారం 2023 లో ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ ద్వారా అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఖనిజ తవ్వకాల ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించగా వారి పిల్లలు చదువుకొనేందుకు పునరావాస నిబంధనల ప్రకారం ఒడిశా మైనింగ్ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జయపురం సమితి ఉమ్మిరి గ్రామ పంచాయతీ ఫూల్‌బెడ గ్రామంలో 2023 లోనే మైనింగ్ ఆదర్శ విద్యాలయ భవన నిర్మాణం పూర్తయ్యింది. 2023 జూన్ నెలలో పాఠశాల ప్రారంభం కానుందని వెంటనే ఆ పాఠశాల భవనాలను అప్ప జెప్పాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అయితే ఆ కాంట్రాక్టర్ భవనాలను అప్పజెప్పలేదు. దీంతో కొరాపుట్ కలెక్టర్, ఎస్పీ కలుగజేసుకుని ఉభయ వర్గాల మధ్య రాజీ కుదిర్చి భవనాలను ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ వారికి అప్పగించారు. అయితే కాంట్రాక్టర్ మూడు గదులకు తాళాలు వేసి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అయితే గత రెండేళ్లలో 9, 10 వ తరగతులలో విద్యార్థులు చేరటంతో పాఠశాలలో తరగతి గదుల కొరత నెలకొంది. కాంట్రాక్టర్‌కు మైనింగ్ కార్పొరేషన్ అధికారులు మూడు గదులు అప్పజెప్పాలని లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు గత అక్టోబర్ 31 వ తేదీన మైనింగ్ కార్పొరేషన్ ప్రాంతీయ డైరెక్టర్ జయపురం సబ్ కలెక్టర్ కుమారీ శొశ్యా రెడ్డికి ఆ విషయం లిఖిత పూర్వకంగా ఆరోపించారు. ఆరోపణ ఆధారంగా సబ్ కలెక్టర్ తహసీల్దార్, జయపురం సదర్ పోలీసు అధికారిలకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయగా అధికారులు మూడు రూంల తాళాలు తెరచి స్వాదీనపరచుకున్నారు.
ఓఎంసీ ఆదర్శ పాఠశాల గదులకు విముక్తి
ఓఎంసీ ఆదర్శ పాఠశాల గదులకు విముక్తి


