శ్రీ గుండిచా ఆలయం ప్రవేశానికి సర్వం సిద్ధం
భువనేశ్వర్: పూరీ సందర్శించే యాత్రికులు, భక్తులకు శుభ వార్త. గత ఆరేళ్లుగా మూసివేసిన పూరీలోని శ్రీ గుండిచా ఆలయం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి భక్తుల కోసం తలుపులు తెరిచేందుకు సర్వం సిద్ధం చేశారు. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌జేటీఏ) డిప్యూటీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్, పూరీ జిల్లా కలెక్టర్ దిబ్య జ్యోతి పరిడా బుధ వారం ఈ విషయాన్ని ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో గుండిచా ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించి మూత వేశారు. వెంబడి భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్‌ఐ) ఆలయ మరమ్మతు, పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతో ఈ శ్రీ గుండిచా ఆలయం మూత వ్యవధి నిరవధికంగా కొనసాగింది. కోవిడ్ తొలగిన తర్వాత 2023లో ఆలయం లోపల మూల స్తంభాలు, దూలాలు, నేలపై ఖొండలైట్ రాతి పలకల అమరిక తదితర పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ పనులు అన్నీ పూర్తి కావడంతో శ్రీ గుండిచా ఆలయ నిర్వహణను ఇప్పుడు ఎస్‌జేటీఏ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. ఆలయ తలుపులు తెరిచి భక్తులకు సజావుగా ఏర్పాట్లు జరిగేలా సన్నాహాలు చేసినట్లు దిబ్య జ్యోతి పరిడా తెలిపారు.
11 మేకలు, గొర్రెలు మృతి
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి ఖరడ పంచాయతీ నీలకంఠాపురం గ్రామం వద్ద బుధవారం వేకువజామున 3.30 లకు ఒక ట్రాక్టరు మేకలు, గొర్రెల మందపై ఎక్కించుకుని వెళ్లిపోగా 9 మేకలు మృత్యువాత పడగా, రెండు గొర్రెలకు గాయాలయ్యాయి. ఈ మేరకు నీలకంఠాపురం గ్రామానికి చెందిన యాదవుడు పిట్ట కృష్ణ తన కుల సంఘం నాయకులకు తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ యాదవకుల సంఘం అధ్యక్షులు అంకబోయిన కులవర్ధనరావు రాణిపేటవద్ద కాపు కాసి ట్రాక్టరును పట్టుకున్నారు. ట్రాక్టరు యజమాని నుంచి మేకలు చనిపోయినందుకు రూ.35 వేలు నష్టపరిహారంగా వసూలు చేసి బాధితుడు పిట్ట కృష్ణకు అందజేశారు. బుధవారం కాశీనగర్ బ్లాక్‌లో దట్టమైన పోగమంచు ఆవరించిన కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్టు ట్రాక్టరు డ్రైవర్ తెలిపాడు.
కుంద్రాలో ఎలుగుబంటి హల్‌చల్
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర గ్రామంలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలో దాదాపు నాలుగు ఎలుగుబంట్లు తిరుగుతున్నాయని ప్రజలు వెల్లడిస్తున్నారు. కుంధ్రా సమితి కార్యాలయ ప్రాంతం, అటవీ కార్యాలయ ప్రాంతంలో, హనుమాన్ మందిర్, జగన్నాథ్ మందిరం, కాలియకద, నువాగుడ, సాగరగుడ తదితర ప్రాంతాలో సంచరిస్తున్నాయని వెల్లడించారు. గత మార్చి నెలలో కుంద్ర పంచాయతీ దొరాగుడ గ్రామంలో లచ్చమన్ హరిజన్(65)అనే వ్యక్తి ఎలుగుబంటి దాడిలో మరణించాడని, ఎలుగు సంచారం వల్ల ఆందోళన నెలకొందని స్థానికులు తెలిపారు. అడవుల్లో ఆహారం లభించకపోవడం వల్ల ఊరిలోకి వస్తున్నాయని చెబుతున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్మీకాంత పట్నాయిక్,బిరజ పండ,బొరిడి బాబుల్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.
న్యూట్రిషన్ గార్డెన్లపై శిక్షణ
జయపురం: స్థానిక ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ గార్డెన్లపై రైతులకు శిక్షణ శిబిరం బుధవారం నిర్వహించారు. న్యూట్రిషన్ గార్డెన్ పంటలపై 5 రకాల శిక్షణలు రైతులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా ఉద్యానవన జాయింట్ డైరెక్టర్ సుభాష్ చంద్ర బిశ్వాల్, వ్యవసాయ కో–ఆర్డినేటర్ అక్షయ కుమార్ పండ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ గుండిచా ఆలయం ప్రవేశానికి సర్వం సిద్ధం
శ్రీ గుండిచా ఆలయం ప్రవేశానికి సర్వం సిద్ధం


