రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి
పర్లాకిమిడి: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధాన్యం, గోధుమల మద్దతు ధర కోసం 380 రోజులు పోరాడి ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని ఆల్ ఇండియా కిసాన్ మోర్చా సంఘ్, కృషక్ సంఘటన్ మంచ్, గజపతి జిల్లా రైతు కూలీ రైతు సంఘం సభ్యులు నిరసన తెలిపారు. ఈ మేరకు స్థానిక కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దండపాని రైయితో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, వ్యవసాయ కూలీలకు కనీస దినసరి కూలీ మంజూరు చేయాలని కోరారు. ఉపాధి కూలీలకు ఏడాదికి 200 రోజుల పని దినాలు కల్పించి, వారికి దినసరి కూలీ రూ.700ల మంజూరు చేయాలని, జంగిల్, భూపట్టాలు, వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని విన్నవించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాలు, నివాస గృహాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం ఏడీఎం(రెవెన్యూ) మునీంద్ర హనగకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకుడు కేదార్ సొబోరో, సర్వ భారతీయ కిసాన్ మోర్చా నాయకుడు ముచ్చి బంగారు, జిల్లా రైతు కూలీ సంఘం సాధారణ కార్యదర్శి రోక్కం లోకనాథం, గజపతి మోటార్ వర్కర్స్ సంఘం నాయకులు నర్సింగ మాలబిశోయి, ఏఐఎఫ్‌బీ జిల్లా అధ్యక్షుడు పైల మురళీకృష్ణ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస బెహరా తదితరులు పాల్గొన్నారు.


