వైద్య సేవలు అంతంత మాత్రమే
● 329 వైద్యుల పోస్టులు ఖాళీ
● జెడ్పీ సమీక్ష సమావేశంలో
ప్రజాప్రతినిధుల అసంతృప్తి
రాయగడ: ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లాలో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ప్రజా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన వైద్య సేవలు అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వైద్య సేవలు గురించి చర్చించారు. జిల్లా కేంద్రాస్పత్రిలో వైద్య సేవలు దయనీయంగా ఉన్నాయని ఎంపీ సప్తగిరి అన్నారు. సుదూర గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతోమంది ఆదివాసీలు, నిరుపేదలు చికిత్స కోసం వస్తుంటే వారికి మెరుగైన సేవలు అందక, పొరుగు రాష్ట్రాలకు చికిత్స కోసం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ వైద్య కేంద్రాల్లో 329 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వైద్యులు పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని డిమికిరిగుడలో పీహెచ్‌సీ ఏర్పాటు ఎంతో అవసరమని జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్ సున్న ప్రతిపాదించారు.
వేయి కోట్లతో అభివృద్ధి పనులు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బిజు సేతు యోజన పథకంలో భాగంగా 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,089 కోట్లతో వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు వివరించారు. దీనిలో భాగంగా మరో 4 కొత్త వంతెనల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవ్వనున్నాయని వెల్లడించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సడ్ యోజన పథకంలో భాగంగా 17 రోడ్ల విస్తరణ పనుల్లో ఇప్పటికే 9 పూర్తయ్యాయని వివరించారు. జిల్లా మినరల్ ఫండ్‌లో భాగంగా ప్రధానమంత్రి సడక్ యోజన, ప్రధానమంత్రి జనమన్‌్ యోజన పథకాలకు సంబంధించి సమావేశంలో చర్చించారు.
డ్రాపౌట్‌ల సంఖ్య పెరుగుతుంది
విద్యా విధానంపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు జిల్లాలో విద్యావిధానం కూడా సంతృప్తికరంగా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. డ్రాపౌట్‌లను నివారించాలని సూచించారు. విద్యా విధానం కొత్త పుంతలు తొక్కుతుందని ప్రభుత్వం ఒకవైపు ప్రకటిస్తున్నా అటువంటిది ఈ జిల్లాలో ఏమాత్రం కనిపించడం లేదని ఎంపీ సప్తగిరి అన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి తదితరులు పాల్గొన్నారు.
వైద్య సేవలు అంతంత మాత్రమే


