ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వినూత్న నిరసన
మల్కన్‌గిరి: జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం వినూత్నంగా శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పోస్టుకార్డ్‌ల ద్వారా ప్రధాని మరియు రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా పంపించారు. ఏన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు తమను గుర్తించడం లేదని వాపోయారు. ఇటీవల దాదాపు 65 శాతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని వాపోయారు. గత మార్చి నెలలో తమ న్యాయమైన డిమాండ్లతో భువనేశ్వర్‌లో ధర్నా చేసినప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ప్రమోద్ బాజింగ, శ్యామ్ సాగరియా, గౌతమ్ దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.


