కీలక ప్రతిపాదనలకు ఆమోదం
సీఎం మోహన్‌చరణ్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం
మూడు ప్రతిపాదనలకు ఆమోదం
భువనేశ్వర్: స్థానిక లోక్‌సేవా భవన్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 3 ప్రతిపాదనలను ఆమోదించారు. సమావేశం తర్వాత అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్ మంత్రివర్గం ఆమోదించిన కీలక నిర్ణయాలను మీడియాకు వివరించారు. సాధారణ పాలన మరియు ప్రజాభియోగాల విభాగం సమర్పించిన మూడు ప్రతిపాదనలను మంత్రి మండలి పరిశీలించి ఆమోదించిందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాలానుగుణంగా ఏర్పడే ఖాళీల సత్వర భర్తీకి వీలుగా కంబైడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (సీజీఎల్‌ఆర్‌ఈ) నిబంధనలు– 2022 సవరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణతో ఉద్యోగాల భర్తీ కోసం ఏడాదికోసారి మాత్రమే ప్రకటన జారీ ఆంక్షకు తెర పడింది. సమయానుకూలంగా ముందస్తు ప్రభుత్వ అనుమతితో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడానికి మార్గం సుగమం అయింది. ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వేగవంతమైన నియామకాలను సులభతరం చేస్తుందని, వివిధ విభాగాల్లో సిబ్బందికి పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుందని భావిస్తున్నారు. గ్రూప్–బీ మరియు గ్రూప్–సీ స్పెషలిస్ట్ ఉద్యోగాలు మరియు సేవల నియామకం కోసం కంబైడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష విధానం సవరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఒడిశా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అర్హత గల ఉద్యోగాల భర్తీకి నవీకరించబడిన కంబైడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష విధానం అమలు చేస్తారు. అలాగే కంబైడ్ హయ్యర్ సెకండరీ (10+2) స్థాయి లేదా తత్సమాన స్పెషలిస్ట్ పోస్టులు నియామక పరీక్ష నియమాల సవరణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. తాజా సవరణతో హోం శాఖలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ కింద జూనియర్ ఫోరెన్సిక్ అటెండెంట్ పోస్టు ఒడిశా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 12 పోస్టులతో కలిపి నియామక పరీక్షను నిర్వహించి భర్తీ చేపడతారు. ఈ నిర్ణయం ఫోరెన్సిక్ సేవలలో సిబ్బంది నియామకాల క్రమబద్ధీకరణతో ఉన్నత మాధ్యమిక అర్హతలు అవసరమయ్యే స్పెషలిస్ట్ పోస్టుల భర్తీలో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.


