కొరాపుట్‌లో బిష్ణు ప్రసాద్ పర్యటన
జయపురం: రాష్ట్ర వ్యవసాయ విభాగ డైరక్టర్, సమన్విత వ్యవసాయ ప్రణాళిక ప్రాజెక్టు నోడల్ అధికారి బిష్ణు ప్రసాద్ పట్నాయక్ రెండు రోజుల కొరాపుట్ జిల్లా పర్యటనకు మంగళవారం విచ్చేశారు. దీనిలో భాగంగా ఆయన కొరాపుట్ జిల్లాలోని బొయిపరిగుడ, నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడలలో పర్యటిస్తారు. బొయిపరిగుడలోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన కేంద్రం సమన్విత వ్యవసాయ ప్రణాళిక ప్రాజెక్టు ద్వారా అమలు చేస్తున్న వ్యవసాయ పనులు స్వయంగా పర్యవేక్షించారు. రైతులు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నందుకు కొనియాడారు. ఆయనతో పాటు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్ర శాస్త్రవేత్తలు ఉన్నారు.
చిత్ర లేఖనం పోటీలు
జయపురం: స్థానిక జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఏడీఆర్ భవనంలో కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ సంస్థ ఆధ్వర్యంలో చిత్ర లేఖనం పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలను కొరాపుట్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి ప్రారంభించారు. పోటీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతల వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి, లోక్ అదాలత్ పర్మినెంట్ విచారపతి బిష్ణుప్రసాద్ దేవత, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ సంతోష్ కుమార్ బారిక్ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 11 నుంచి ధాన్యం కొనుగోళ్లు
జయపురం: కొరాపుట్ జిల్లాలో డిసెంబర్ 11వ తేదీ నుంచి మండీల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఖరీఫ్ ధాన్యం సేకరణ కమిటీ నిర్ణయించింది. సోమవారం కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు 108 మండీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండీల్లో ధాన్యం అమ్మేందుకు 44,104 మంది రైతులను గుర్తించి అనుమతి కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నవరంగపూర్ ఎంపీ బలభద్ర మఝి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చ, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర హంతాల్, కోట్‌పాడ్ ఎమ్మెల్యే రూపుబోత్ర, జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, అదనపు జిల్లా కలెక్టర్ తపన కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కాలువలో పడిపోయిన ప్రైవేటు బస్సు
భువనేశ్వర్: సువర్ణపూర్ జిల్లా బినికా పోలీస్‌స్టేషన్ పరిధి సింగియుబా సమీపంలో ప్రైవేటు ప్రయాణికుల బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని బినికా సామూహిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బస్సు భువనేశ్వర్ నుంచి బరగడ్ జిల్లా బీజేపూర్ సమీపంలో భద్రాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని సోన్‌పూర్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని బుర్లాకు తరలించారు.
కొరాపుట్‌లో బిష్ణు ప్రసాద్ పర్యటన
కొరాపుట్‌లో బిష్ణు ప్రసాద్ పర్యటన
కొరాపుట్‌లో బిష్ణు ప్రసాద్ పర్యటన


