వాడీవేడిగా ప్రోక్యూర్‌మెంట్ కమిటీ సమావేశం
పర్లాకిమిడి: స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాస్థాయి ఖరీఫ్ ధాన్యం ప్రోక్యూర్‌మెంట్ కమిటీ సమావేఽశం వాడీవేడిగా మంగళవారం జరిగింది. సమావేశానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, ఎంపీ ప్రతినిధి రౌతు విజయకుమార్, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశ్‌రావు, డీఆర్‌సీఎస్ అధికారి హరిహర శెఠి, అదనపు ఎస్పీ అమితాబ్ పండా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు జి.తిరుపతిరావు మాట్లాడుతూ.. గతేడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం 22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 1,15,436 మెట్రిక్ టన్నులు మాత్రమేనని మండిపడ్డారు.
తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది
జిల్లాలో సకాలంలో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో గుసానిలో రైతులు పక్క రాష్ట్రాలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని పలువురు రైతులు విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటివరకు తేదీలు ఖరారు చేయకుండా సమావేశానికి ఎందుకు పిలిచారాని జిల్లా బీజేపీ కృషక్ మోర్చా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ పాలో మండిపడ్డారు. గజపతి జిల్లాలో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, కొనుగోళ్లకు సొసైటీలకు అధికారం ఇచ్చామని ఆర్‌ఎంసీఎస్ అధికారులు వెల్లడించారు. దీనిపై జిల్లాలోని అన్ని సమతి కేంద్రాల్లో ప్రచారం ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు ధాన్యం మండీల్లో కొనుగోళ్లకు 15,436 మంది రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. ఇంకా ఎవరైనా రైతులు మిగిలి ఉంటే వారు కూడా వెబ్‌సైట్‌లో తమ ఆధార్ కార్డు, రైతు కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అసిస్టెంటు సివిల్ సప్లయ్ అధికారి సుభాష్ చంద్ర శెఠి సూచించారు. సమావేశంలో ఆర్.ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ, మిల్లర్లు, రైతులు పాల్గొన్నారు.


