విద్యార్థుల ఆందోళన
రాయగడ: సదరు సమితి అమలాభట్ట వద్దనున్న మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కళాశాల ప్రధాన గేటు వద్ద వారంతా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్లస్ త్రీ పరీక్షలు పూర్తయినప్పటికీ ఫలితాలు సకాలంలో ప్రకటించడం లేదని, అదేవిధంగా పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థుల రోల్ నంబర్లు గజిబిజిగా ఉండడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వాపోయారు. ఇదిలా ఉండగా ఐదో సెమిస్టర్ పరీక్షలు పూర్తయినా ఇప్పటికీ ముందు రాసిన రెండో సెమిస్టర్ ఫలితాలను నిర్వాహకులు ప్రకటించకపోవడం దారుణమన్నారు. సకాలంలో ఫలితాలు ప్రకటించకుండా రానున్న పరీక్షల కోసం ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికై నా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
విద్యార్థుల ఆందోళన


