ఉత్సాహవంతం కావాలి
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025
వృద్ధాప్యం..
భువనేశ్వర్:
వయసు మీరిన పెద్దలు వృద్ధాప్యం పట్ల నిరుత్సాహం చెందకుండా ఉత్సాహవంతంగా జీవిత కాలం కొసాగాలని జట్నీ వయో వృద్ధుల సంఘం పిలుపునిచ్చింది. ఈ సంఘం 14వ వార్షికోత్సవం పురస్కరించుకుని సోమవారం స్థానిక అగర్వాల ధర్మశాలలో ప్రత్యేక సభా కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు భక్తబంధు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒడిశా వయో వృద్ధుల మహాసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రధాన సలహాదారు కృపాసింధు సాహు హాజరై ప్రసంగించారు. వయసు మీరిన పెద్దలు సమాజానికి అమూల్యమైన సంపద అని, వారంతా ఒకరికి ఒకరుగా చేతులు కలిపి తమను తాము వృద్ధులుగా భావించకుండా ఒకరికొకరు సహాయం చేసుకుని ముందుకు సాగితే వృద్ధాప్యం ఉత్సాహంగా గడుస్తుందన్నారు. వయసు మీరిందని నిరాశ చెందకుండా ఆరోగ్యంపై తగిన జాగ్రత వహించడంపై ప్రాధాన్యత కల్పించాలని కోరారు. హెల్ప్ ఏజ్ ఇండియా భువనేశ్వర్ శాఖకు చెందిన భారతి చక్ర గౌరవ అతిథిగా హాజరై వయో వృద్ధులు దైనందిన కార్యకలాపాలపై సమయపాలన పాటించడం అత్యంత అవసరమని, వేళకు తగిన ఆహారం, సకాలంలో మందులు తీసుకోవడంపై శ్రద్ధ వహించాలని ప్రోత్సహించారు. సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు చవి చూసిన పెద్దల సంక్షేమానికి పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే దిశలో ఈ సంఘం చురుగ్గా పని చేయాలని విశిష్ట అతిథిగా పాల్గొన్న జెట్ని పోలీస్ ఠాణా ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి స్టాలిన్ కుమార్ బిశ్వాల్ కోరారు. వయో వృద్ధుల కోసం సంకల్పించిన పింఛన్ వంటి పథకాలు దైనందిన సామాజిక స్థితిగతులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నవీకరించి దోహదపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జట్నీ వయో వృద్ధుల సంఘం ప్రతిపాదించింది. ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతున్న సంక్షేమ పథకాల్ని రద్దు చేయడం, కుదించడం వంటి చర్యలకు పాల్పడరాదని హితవు పలికారు. రైలు చార్జీలో వయో వృద్ధుల రాయితీ సదుపాయం తొలగించడం అత్యంత విచారకరం. తక్షణమే ఈ సదుపాయం పునరుద్ధరించాలని సంఘం అభ్యర్థించింది. ఆస్పత్రుల్లో వయో వృద్ధులకు ప్రాధాన్యత ప్రాతిపదికన మౌలిక చికిత్స, వైద్యం అనుబంధ సౌకర్యాల అమలు, కార్యాచరణ పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహిస్తే పూర్తి స్థాయిలో ఫలప్రదం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వార్షికోత్సవ సంచిక వరిష్ట, అధ్యక్షుడు భక్తబంధు చౌదరి రాసిన అప్రియ సొత్తొ (చేదు నిజం) పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ప్రతిభావంతులైన వయో వృద్ధులను సత్కరించారు. ప్రహ్లాద్ సాహు, బామదేవ్ మిశ్రా, నిరంజన్ మహాపాత్రొ, రాధా మోహన్ పట్నాయక్, ప్రహ్లాద్ లెంకా, పి. జగన్నాథ్ పట్నాయక్. జట్నీ ఠాణా ఇనస్పెక్టరు ఇంచార్జి స్టాలిన్ బిస్వాల్ ఈ ప్రతిభా సత్కారం అందుకున్నారు.
ఉత్సాహవంతం కావాలి
ఉత్సాహవంతం కావాలి
ఉత్సాహవంతం కావాలి


